Dishwasher Prices: ఏళ్ల తరబడి మహిళలకు పెద్ద తలనొప్పిగా మారిన గిన్నెలు తోమే తిప్పలకు ఎట్టకేలకు చెక్ పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు సంపన్నులు, లగ్జరీ ఇళ్లకే పరిమితమైన ‘డిష్‌వాషర్లు’ ఇప్పుడు సాధారణ ఇళ్లలోకి శరవేగంగా చొచ్చుకొస్తున్నాయి. ప్రభుత్వం జీఎస్టీని గణనీయంగా తగ్గించడంతో వీటి ధరలు భారీగా పతనమవడం, మరోవైపు మన దేశ వంటశైలికి తగ్గట్టుగా తయారీ సంస్థలు తెచ్చిన సరికొత్త మార్పులతో డిష్‌వాషర్ల విక్రయాలు మార్కెట్లో ఊహించని సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలోనే అత్యంత వేగంగా అమ్ముడవుతున్న నంబర్ వన్ ప్రొడక్ట్‌గా డిష్‌వాషర్ అవతరించిందని రికార్డ్‌లు చెబుతున్నాయి.
ఏకంగా 3 రెట్లు పెరిగిన సేల్స్..
గతంలో డిష్‌వాషర్ కొనాలంటే కేవలం మెట్రో నగరాల్లోని ధనవంతులే ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తయారీదారులు, రిటైల్ దిగ్గజాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పన్నుల తగ్గింపు తర్వాత వీటి అమ్మకాలు ఏకంగా మూడు రెట్లకు పైగా పెరిగాయి. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టైర్-2, చిన్న నగరాలే ఈ అమ్మకాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. మొత్తం విక్రయాల్లో దాదాపు 30 శాతం వాటా చిన్న నగరాల నుంచే వస్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. కేవలం 2026 మొదటి ఆరు నెలల కాలంలోనే వీటి సేల్స్ రికార్డు స్థాయిలో 49 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
రేట్లు ఎంత తగ్గాయంటే
కేంద్ర ప్రభుత్వం డిష్‌వాషర్లపై జీఎస్టీని 10 శాతం మేర తగ్గించి, 18 శాతానికి తీసుకురావడంతో మార్కెట్లో వీటి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఒక్కో మిషన్‌పై సుమారు రూ.4,500 నుంచి రూ.7,500 వరకు కంపెనీలు ధరలను తగ్గించాయి. దీంతో ఇప్పుడు డిష్‌వాషర్ల స్టార్టింగ్ ధర దాదాపు రూ.25,000కే అందుబాటులోకి వచ్చింది. అంటే దాదాపు ఒక ఫ్రిజ్ లేదా వాషింగ్ మెషీన్ ధరకే వంటింటి డిష్‌వాషర్ లభిస్తుండటంతో జనం వీటిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ సామర్థ్యం కలిగిన 15 ప్లేస్ సెట్టింగ్ మోడళ్ల అమ్మకాలు ఏకంగా 137 శాతం పెరగడం డిమాండ్ తీవ్రతను స్పష్టం చేస్తోందంటున్నారు.
బిర్యానీ పాత్రలు, కుక్కర్లు, మసాలా మరకలు సైతం క్లీన్!
పాశ్చాత్య దేశాల పాత్రలకు మాత్రమే డిష్‌వాషర్లు పనికొస్తాయని, మన భారతీయ వంటింట్లో వాడే నూనె, జిడ్డు, పసుపు, కారం మరకలు పోవనే అపోహ చాలామందిలో ఉండేది. ఈ సమస్యను పసిగట్టిన కంపెనీలు మన దేశీయ వంటకాలకు తగినట్లుగా సరికొత్త టెక్నాలజీతో కూడిన ఫీచర్లను తీసుకొచ్చాయి. ‘కడాయి వాష్’ పేరిట మాడు పట్టిన బిర్యానీ గిన్నెలు, జిడ్డు మరకలు, ప్రెషర్ కుక్కర్లను సైతం నిమిషాల్లో మిలమిలా మెరిపించే ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చాయి. బాష్, సిమెన్స్, ఎల్‌జీ, ఐఎఫ్‌బీ వంటి దిగ్గజ సంస్థలు వినియోగదారులకు ఏకంగా 30 రోజుల ట్రయల్ పీరియడ్ ఇవ్వగా, వాపస్ చేసిన వారి శాతం 0.1 కంటే తక్కువగా ఉండటం ఈ మిషన్ల పనితీరుపై నమ్మకాన్ని పెంచింది.
అమెరికా, యూరప్ దేశాల్లో 70 నుంచి 75 శాతం ఇళ్లలో ఇవి వాడుతుండగా, భారత్‌లో ప్రస్తుతం కేవలం 0.5 శాతం ఇళ్లలోనే డిష్‌వాషర్లు ఉన్నాయి. అయితే పెరుగుతున్న ఆదాయాలు, ఉద్యోగం చేసే మహిళల సంఖ్య అధికమవడం, అందుబాటులోకి వచ్చిన ధరల కారణంగా భవిష్యత్తులో ప్రతి వంటింట్లోనూ డిష్‌వాషర్ అనివార్యమైన గృహోపకరణంగా మారే దిశగా దూసుకుపోతోందని అంటున్నారు.

