NTV Telugu Site icon

Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

Bhogi

Bhogi

Bhogi Festival: సంక్రాంతి పండగ ముందురోజు భోగీని నిర్వహించుకుంటారు. భోగి రోజు అన్ని చెడు కర్మలు తొలగాలని పాతవస్తువులను భోగి మంటలో వేస్తారు. అంతేకాకుండా భోగీ నాడు సాయంత్రం పూట ఐదేళ్ల పిల్లలందరికీ భోగి పళ్లు పోస్తారు. పిల్లలకు ఉండే బాలారిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భోగి పళ్ళు పోస్తారు. అయితే భోగి పళ్లలో రేగి పళ్లను మాత్రమే వాడతారు. ఎందుకంటే చిన్న పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేగిపండు అరా కూడా పలచగా ఉంటుంది. ఈ రేగి పళ్లకు రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి.

Read Also: Astrology: జనవరి 14, శనివారం దినఫలాలు

భోగీ పళ్లను పోసిన సమయంలో రేగి పళ్ల నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. రేగి పళ్లు తలపైన నుంచి పడటం వల్ల తలలోని మెదడులోని నరాలకు రేగి పళ్ల నుండి వచ్చే వాయువు వల్ల ఆక్టివ్ అవుతారు. శీతాకాలంలో వచ్చే జబ్బులు వల్ల పిల్లలు మెతక బడిపోతారు. ఈ రేగి పళ్లలో అరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది. ఎటువంటి పరిస్థితులను అయినా ఎదురుకునే శక్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ రేగి పళ్లనే పోస్తారు, అలాగే పిల్లలకు ఎక్కువగా దిష్టి ప్రభావం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పళ్లు పోయడం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది.

మరోవైపు రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం అని హిందువుల విశ్వాసం. భోగి రోజున ఈ పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తమ పిల్లలపై ఉంటుందని నమ్మకం. చిన్న పిల్లల తలపై బోగీ పళ్లను పోయడం వల్ల వారు జ్ఞానవంతులవుతారని, ఆరోగ్యంగా జీవిస్తారని పెద్దల నమ్మకం.

Show comments