Antibiotics for Fever and Cold: జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు వచ్చినప్పుడు చాలామంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాంటీబయోటిక్స్ (antibiotics) వాడేస్తుంటారు. కొందరు పాత ప్రిస్క్రిప్షన్ (old prescription) చూసి మందులు వేసుకుంటే, మరికొందరు నేరుగా మెడికల్ షాప్‌కి వెళ్లి సొంతంగా కొనుక్కుని తింటుంటారు. ఇలా చేయడం వల్ల జబ్బు త్వరగా నయమవుతుందని అనుకుంటారు కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి జ్వరం (fever), దగ్గు (cough) లేదా గొంతు నొప్పి (sore throat) కి యాంటీబయోటిక్స్ వాడటం మన శరీరానికి ప్రమాదకరంగా మారుతుంది. నవంబర్ 18 నుంచి 24 వరకు ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారం జరుగుతోంది. ఈ సందర్భంగా డాక్టర్లు అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ తీసుకోవద్దని అందరికీ సూచిస్తున్నారు.
సాధారణంగా యాంటీబయోటిక్ మందులు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల చికిత్సకు మాత్రమే పనికొస్తాయి. కానీ గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ వంటివి ఎక్కువగా వైరస్ వల్ల వస్తాయి. వీటిపై యాంటీబయోటిక్స్ పెద్దగా పనిచేయవు. అయినా సరే చాలామంది వాటిని వేసేసుకుంటున్నారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డాక్టర్ సలహా లేకుండా ఎక్కువ కాలం యాంటీబయోటిక్స్ వాడితే, ఆ మందుల ప్రభావం శరీరంపై తగ్గుతూ వస్తుంది. ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రి ఎమెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ సుభాష్ గిరి చెప్పిన వివరాల ప్రకారం.. అనవసరంగా యాంటీబయోటిక్స్ వేసుకోవడం వల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (antimicrobial resistance) సమస్య పెరుగుతోంది. అంటే, ఇంతకుముందు బ్యాక్టీరియాని సమర్థవంతంగా చంపేసిన మందులకే, ఆ బ్యాక్టీరియా తట్టుకునే శక్తిని పెంచుకునే పరిస్థితి అన్నమాట. దీనివల్ల ఇన్ఫెక్షన్ కి చికిత్స చేయడం కష్టంగా మారుతుంది, చాలాసార్లు మందులు అసలు పనిచేయకుండా పోతాయి. అప్పుడు వేరే యాంటీబయోటిక్స్ వాడాల్సి వస్తుంది, అవి ఖరీదైనవిగా ఉంటాయి. దీనివల్ల చికిత్స ఖర్చు కూడా పెరిగిపోతుంది. అందుకే జ్వరం, దగ్గు లేదా గొంతు నొప్పి వచ్చినప్పుడు మీకు మీరే యాంటీబయోటిక్స్ వాడకండి. అవసరం అనిపిస్తే డాక్టర్ పరీక్షలు చేసి, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాతో వచ్చిందా లేక వైరస్ తో వచ్చిందా అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ డాక్టర్ యాంటీబయోటిక్ రాస్తే, ఎంత డోస్ రాశారో అంతే వేసుకోవాలి. ఈ విషయంలో ఎప్పుడూ డాక్టర్ సలహానే పాటించాలి.

