SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?

Sbi

Sbi

SBI: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫౌండేషన్ శుభవార్త చెప్పింది. ఎస్‌బిఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ (SBI Platinum Jubilee Asha Scholarship Program) 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ స్కాలర్‌షిప్ కార్యక్రమాల్లో ఒకటైన ఈ పథకం ద్వారా ఈ ఏడాది రూ.100 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. దేశవ్యాప్తంగా 25,707 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని SBI ఫౌండేషన్ తెలిపింది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ స్కాలర్‌షిప్ వివిధ విభాగాల విద్యార్థులకు అందుబాటులో ఉంది. అవేమంటే..
* 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు.
* డిగ్రీ (UG) విద్యార్థులు.
* పీజీ (PG) విద్యార్థులు.
* MBBS చదువుతున్న విద్యార్థులు.
* IITల్లో చదువుతున్న విద్యార్థులు.
* IIMల్లో చదువుతున్న విద్యార్థులు.
* విదేశాల్లో మాస్టర్స్ చేస్తున్న విద్యార్థులు.

అర్హతలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7.5 CGPA సాధించి ఉండాలి. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు NAAC Grade A లేదా అంతకంటే మెరుగైన గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, NIRF 2025-26 టాప్-300 సంస్థలు, లేదా QS 2025-26 టాప్-200 విశ్వవిద్యాలయాల్లో చదువుతూ ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం పాఠశాల విద్యార్థులకు రూ.3 లక్షలలోపు, అలాగే కాలేజీ విద్యార్థులకు రూ.6 లక్షలలోపు ఉండాలి. అయితే ప్రతి విభాగానికి సంబంధించిన పూర్తి అర్హత వివరాలను అధికారిక స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు.

ఎంత స్కాలర్‌షిప్ లభిస్తుంది?

ఈ పథకం కింద రూ.15,000 నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందించనున్నారు. విద్యార్థి చదివే కోర్సు, విభాగాన్ని బట్టి స్కాలర్‌షిప్ మొత్తం మారుతుంది. అర్హత నిబంధనలు కొనసాగిస్తే, కోర్సు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు SBI ఫౌండేషన్ తెలిపింది.

దరఖాస్తు విధానం:

అర్హులైన విద్యార్థులు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. https://www.sbiashascholarship.co.in/auth?mode=signup వెబ్ సైట్ లో అప్లికేషన్ ను పూర్తి చేసుకోవాలి. ముందుగా SBI ఆశా స్కాలర్‌షిప్ అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి. తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న స్కాలర్‌షిప్ విభాగానికి సంబంధించిన అర్హతలను చూసుకున్న తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలి. అందులో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తును సమర్పించాలి. ఆ తర్వాత నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్‌కు సమాచారం అందుతుంది.

దరఖాస్తులకు చివరి తేదీ:

SBI Platinum Jubilee Asha Scholarship Program 2026కు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 4, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అవసరమైన పత్రాలను సరిగా అప్‌లోడ్ చేయాలని, లేనిపక్షంలో దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది.