Layoffs: ఇండియాలో లేఆఫ్‌ ప్రకంపనలు.. ఆ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్..!

Layoffs 300kb

Layoffs 300kb

Layoffs: సామ్‌సంగ్ ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజాల్లో ఒకటైన సామ్‌సంగ్.. భారత్‌లో తన టీవీ, హోమ్ అప్లయన్సెస్ వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది. ఇప్పటికే సుమారు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్‌లను ఉద్యోగాల నుంచి తప్పించినట్లు ‘ది ఎకనామిక్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది. ఈ కోతలు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. దీపావళి తర్వాత మరో రౌండ్ ఉద్యోగాల కోతలు కూడా ఉండొచ్చన్న వార్తలు ఉద్యోగుల్లో మరింత ఆందోళన పెంచుతున్నాయి. ఇంతకీ సామ్‌సంగ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? అసలు ఎవరిపై ఈ ప్రభావం పడుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకే షాక్

ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగాల కోత ప్రధానంగా సామ్‌సంగ్ ఇండియా టెలివిజన్, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లోనే ఉంది. డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడర్లు, బ్రాంచ్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లు వంటి మేనేజీరియల్ పోస్టుల్లో ఉన్నవారికి కూడా టెర్మినేషన్ నోటీసులు ఇస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా దశలవారీగా నోటీసులు జారీ చేస్తున్నారని, కొంతమందిని నోటీస్ పీరియడ్ పూర్తి చేయకుండానే రిలీవ్ చేస్తున్నారని సమాచారం.

మూడు నెలల జీతం.. అదనంగా మరో నెల జీతం

ఉద్యోగాల నుంచి తప్పిస్తున్న వారికి సెవరెన్స్ ప్యాకేజీ కూడా అందిస్తున్నట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. మూడు నెలల జీతంతో పాటు ఉద్యోగి సంస్థలో పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా ఒక నెల జీతాన్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోని సేల్స్, మార్కెటింగ్ విభాగంలో సుమారు 550 నుంచి 600 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారని, వీరిలో గణనీయమైన శాతం వరకు భవిష్యత్తులో ప్రభావితమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్ ఉద్యోగులకు ప్రస్తుతానికి ఊరట

ప్రస్తుతం జరుగుతున్న కోతల్లో సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ విభాగాన్ని చేర్చలేదు. భారత్‌లో కంపెనీకి మొబైల్ బిజినెస్ అత్యంత కీలకమైన విభాగం కావడంతో పండుగల సీజన్‌లో అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ ఆశిస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే ప్రస్తుత రీస్ట్రక్చరింగ్‌ను టీవీలు, హోమ్ అప్లయన్సెస్ వ్యాపారాలకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయితే మొబైల్ బిజినెస్‌పై ఒత్తిడి పూర్తిగా లేదని చెప్పలేం. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాల్యూమ్స్ కూడా తగ్గుతున్నాయి.

అసలు సమస్య ఎక్కడ మొదలైంది?

సామ్‌సంగ్‌కు ప్రధానంగా పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, బలహీనమైన డిమాండ్, తగ్గుతున్న మార్జిన్లు సమస్యగా మారాయి. ముఖ్యంగా మెమరీ చిప్ ధరలు భారీగా పెరగడం కంపెనీపై అదనపు ఒత్తిడి తీసుకొచ్చింది. దీనికి తోడు రూపాయి విలువ తగ్గడం, ఇతర ముడి పదార్థాల ధరలు పెరగడం కూడా ఖర్చులను పెంచాయి. ఈ పరిస్థితుల్లో సంస్థలోని మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించి, ఒకే తరహా పనులు చేసే విభాగాలను కలపడం ద్వారా ఖర్చులను నియంత్రించాలని సామ్‌సంగ్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

బ్రాంచ్‌ల విలీనం.. ఆఫీసుల్లోనూ మార్పులు

ఉద్యోగాల కోతతో పాటు సామ్‌సంగ్ తన ప్రాంతీయ ఆపరేషన్లను కూడా మార్చుతోంది. రాంచీ, పాట్నా వంటి బ్రాంచ్‌లను, ఢిల్లీ, గురుగ్రామ్ వంటి కార్యాలయాలను కలిపే ప్రక్రియ కొనసాగుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల కార్యకలాపాల్లోనూ మార్పులు చేపడుతున్నట్లు సమాచారం. ఒకే విధమైన పనులు, మేనేజ్‌మెంట్ వ్యవస్థలను కలపడం ద్వారా సంస్థలోని అదనపు పోస్టులను తగ్గించాలన్నది ఈ రీస్ట్రక్చరింగ్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

టీవీ, అప్లయన్సెస్ టీమ్‌లను కలిపే ప్లాన్

సామ్‌సంగ్ టీవీ, హోమ్ అప్లయన్సెస్ సేల్స్ టీమ్‌లను ఒకే నిర్మాణంలోకి తీసుకురావాలని కూడా భావించింది. దీని ద్వారా మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించి ఖర్చులను నియంత్రించాలని కంపెనీ చూస్తోంది. అయితే ఈ విలీన ప్రక్రియను డిసెంబర్ క్వార్టర్ వరకు వాయిదా వేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అంటే ప్రస్తుత ఉద్యోగాల కోత తర్వాత కూడా సంస్థలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందన్నమాట.

లాభాలు పెరిగినా ఉద్యోగాల కోత ఎందుకు?

ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. సామ్‌సంగ్ ఇండియా వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయిందని భావించాల్సిన అవసరం లేదు. FY25లో కంపెనీ ఆదాయం సుమారు రూ.1.1 లక్షల కోట్లకు చేరగా, నికర లాభం రూ.11,287 కోట్లుగా నమోదైంది. అయినప్పటికీ కొన్ని విభాగాల్లో మార్జిన్ ఒత్తిడి, ఖర్చుల పెరుగుదల, డిమాండ్ మందగించడం వంటి కారణాలతో సంస్థ ఖర్చులను మరింత కట్టడి చేయాలని చూస్తోంది. అందుకే కంపెనీ పనితీరు బలంగా ఉన్నప్పటికీ, నిర్దిష్ట వ్యాపార విభాగాల్లో ఉద్యోగాల కోత జరుగుతోంది.

దీపావళి తర్వాత మరోసారి కోతలు?

ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల కోతతో వ్యవహారం ముగిసిపోలేదన్న సంకేతాలు కూడా ఉన్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం, దీపావళి తర్వాత టీవీ, హోమ్ అప్లయన్సెస్ వ్యాపారాల్లో మరోసారి మ్యాన్‌పవర్ రేషనలైజేషన్ జరిగే అవకాశం ఉంది. పండుగల సీజన్‌లో అమ్మకాలు ఎలా ఉంటాయి, డిమాండ్ ఎంతవరకు తిరిగి పుంజుకుంటుంది అనే దానిపై తదుపరి నిర్ణయాలు ఆధారపడే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ విభాగాన్ని ప్రస్తుతానికి మినహాయించినప్పటికీ, భవిష్యత్తులో ఆ విభాగాన్ని కూడా సమీక్షించే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

ఇండియాలో జరుగుతున్న ఈ మార్పులు సామ్‌సంగ్ కంపెనీ భారత్ నుంచి వెనక్కి తగ్గుతున్న సంకేతాలు కావు. బదులుగా ఖర్చులను తగ్గించడం, సంస్థ నిర్మాణాన్ని సింపుల్ చేయడం, తక్కువ మేనేజ్‌మెంట్ లేయర్లతో మరింత ఎఫిషియంట్‌గా పనిచేయడం కోసం చేపడుతున్న రీస్ట్రక్చరింగ్‌గా కనిపిస్తోంది. అయితే దీపావళి తర్వాత పరిస్థితులు ఎలా మారతాయి, మరెంతమంది ఉద్యోగులపై దీని ప్రభావం పడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.