దేశంలోని నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు భారతీయ రైల్వే ఒక గుడ్ లీఫ్ ఇచ్చింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) , జోన్లలో ఖాళీగా ఉన్న స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీ కోసం రైల్వే శాఖ ఒక ప్రత్యేక నియామక ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 1,265 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించగా, ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది.
ముఖ్యమైన తేదీలు , జోన్ల వారీగా ఖాళీలు
రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్టేషన్ మాస్టర్ పోస్టుల ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 25, 2026 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే జోన్లలో ఈ అవకాశాలు అందుబాటులో ఉండటంతో, అర్హులైన గ్రాడ్యుయేట్లు వివిధ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కేంద్రీకృత ఉపాధి ప్రకటన (CEN) నెం. 08/2026 కింద ఈ నియామకాలు చేపట్టనున్నారు. అత్యధికంగా ఆర్ఆర్బి ముంబై పరిధిలో 177 ఖాళీలు ఉండగా, ఆ తర్వాత జమ్మూ-శ్రీనగర్ జోన్లో 122, చెన్నై జోన్లో 119 ఖాళీలను ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు, అర్హతలు, సిలబస్ వంటి ఇతర సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.
రైల్వే నెట్‌వర్క్‌లో ముమ్మరంగా టిక్కెట్ తనిఖీ డ్రైవ్
మరోవైపు రైల్వే ప్రయాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాయితీ టిక్కెట్లు, స్థిర రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాస్‌లు , గ్రూప్ బుకింగ్‌లను లక్ష్యంగా చేసుకుని సెంట్రల్ రైల్వే నెట్వర్క్ అంతటా అక్టోబర్ 31 వరకు ప్రత్యేక టిక్కెట్ తనిఖీ డ్రైవ్ కొనసాగుతోందని రైల్వే శాఖ మరో ప్రకటనలో తెలిపింది. రైల్వే స్టేషన్లతో పాటు లోకల్ రైళ్లలోనూ ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రయాణికులు తప్పనిసరిగా గమనించాల్సిన అంశాలు
ఈ తనిఖీల్లో భాగంగా సిబ్బంది ప్రయాణికుల అర్హతను పరిశీలిస్తారు. రాయితీలు , కోటా ప్రయాణాలు చేసేవారు విధిగా అసలు గుర్తింపు పత్రాన్ని (Original ID) చూపించాల్సి ఉంటుంది. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ప్రభుత్వ ఫోటో ఐడీ, స్టూడెంట్ ఐడీ, ఫోటోతో కూడిన బ్యాంక్ పాస్‌బుక్ లేదా లామినేటెడ్ క్రెడిట్ కార్డ్‌లను ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాలుగా పరిగణిస్తారు. ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం ఫోటోకాపీలు లేదా మొబైల్లో ఉన్న ఫొటోలపై ఆధారపడకుండా, ఒరిజినల్ డాక్యుమెంట్‌ను మాత్రమే తమ వెంట ఉంచుకోవాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

