Qualities of a Good Incharge: మీరు పనిచేస్తున్న చోట మీకు సడన్‌గా ఇన్‌ఛార్జ్ పోస్ట్ ఆఫర్ వచ్చిందనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు?. సంస్థ నన్ను గుర్తించిందనుకొని సంతోషపడతారా? శాలరీ పెరుగుతుందని సంబరం చేసుకుంటారా? అధికారం చేతికొస్తుందని ఆనందం వ్యక్తం చేస్తారా? బాధ్యతలు పెరుగుతాయేమోనని బాధపడతారా?. అది మీ ఇష్టం. కానీ.. ఇవన్నీ తర్వాత. ముందు.. మీలో ఇన్‌ఛార్జ్ లక్షణాలున్నాయో లేదో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇంతకీ అవేంటని ఆలోచిస్తున్నారా?. వాటి గురించే ఈ విశ్లేషణ..
1. ఇన్‌ఛార్జ్‌కి ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన, పూర్వానుభవం ఉండాలి. అందరికన్నా ఒక ఆకు ఎక్కువే చదివి ఉండాలి. అప్పుడే టీమ్‌ని సాఫీగా నడిపించగలడు. సంస్థ తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టగలడు.
2. తన టీమ్‌లోని సభ్యులందరి శక్తిసామర్థ్యాలు తెలిసుండాలి. ఎవరు దేనికి సూటవుతారో వాళ్లకు ఆయా సబ్జెక్టులను మాత్రమే ఎక్కువగా ఇవ్వాలి. అవసరమైన సమయంలో అన్ని పనులూ చేసేలా తీర్చిదిద్దుకోవాలి.
3. ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. టీమ్ మెంబర్ తప్పు చేస్తే తగిన సమయంలో సున్నితంగా మందలించాలి. ఆ విషయంలో వయసును లెక్కలోకి తీసుకోకూడదు. చిన్నా, పెద్ద అనే తేడా చూపకూడదు.
4. ఇన్‌ఛార్జ్.. సీక్రసీ, ప్రైవసీ మెయిన్‌టెయిన్ చేయాలి. టీమ్ మెంబర్లు ఒకరికొకరు షేర్ చేసుకున్నంత ఓపెన్‌గా, ఫ్రీగా అన్ని విషయాలను వెల్లడించకూడదు. అన్నీ తనలో దాచుకొని కొన్ని మాత్రమే బయటికి చెప్పాలి.
5. తాను ఆఫీసులో లేకపోయినా అక్కడ జరిగేవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోగలగాలి. అది ఆయనకు/ఆమెకు అవసరం. దీనికోసం ఒకరిద్దరిని ‘నమ్మినబంట్లు’గా మార్చుకోవచ్చు. అది తప్పు కాదు. తప్పదు కూడా.
6. కొత్తవాళ్లను ఎంపిక చేసేటప్పుడు అసలు సిసలు ట్యాలెంట్‌ని గుర్తించాలి. ‘సరైనోడు’ దొరికితే అతను అడిగినదానికన్నా ఎక్కువ శాలరీ ఆఫర్ చేసి తన ‘పెద్ద మనసు’ను చాటుకోవచ్చు. అలాంటి ఇన్‌ఛార్జ్‌లు అరుదు.
7. టీమ్ మెంబర్లలో ఎవరికైనా తన కన్నా ఎక్కువ ప్రతిభ ఉంటే గర్వపడాలి గానీ ఈర్ష్య పడకూడదు. అది సంకుచిత మనస్తత్వం కిందే లెక్క. అతడు తనని మించిపోతాడేమోననే ఆత్మన్యూనతా భావానికి లోనుకాకూడదు.
8. కొందరు సచిన్ టెండుల్కర్‌లా బ్యాటింగ్ చేయగలరు. కానీ సౌరవ్ గంగూలీ లాంటి సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కాలేరు. దీనికి కారణం వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోవటం. ఇన్‌ఛార్జ్‌కి తనదైన స్ట్రాటజీ, పాలసీ ఉండాలి.
9. మంచిగా పనిచేస్తే మెచ్చుకోవాలి. వెనకబడ్డవాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించాలి. అవసరమైతే తన టీమ్ మెంబర్ల పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ల సమస్యల గురించి కూడా తెలుసుకొని సరైన సలహాలు సూచనలు ఇవ్వాలి.
10. పైవాళ్లు తనపై అసంతృప్తి గానీ ఆగ్రహం గానీ వెలిబుచ్చితే దాన్ని ఇన్‌ఛార్జ్ తన కిందివాళ్ల మీద చూపించకూడదు. తనలో ఏమైనా లోపాలున్నాయేమో ఆత్మవిమర్శ చేసుకోవాలి. టీమ్ మెంబర్లను హర్ట్ చేయకూడదు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్‌ఛార్జ్ అనే వ్యక్తి ‘ఆల్ ఇన్ వన్’లా ఉండాలి. ఒక్కోసారి కఠినంగానూ నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగాలు చేసే ప్రతిఒక్కరూ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అందరూ ఇలా తమనుతాము పరీక్షించుకొని, పరిశీలించుకొని ఒక అంచనాకు, అవగాహనకు రావాలి. అంతేగానీ.. అవకాశం వచ్చింది కదా అని అర్హత లేకపోయినా అందలం ఎక్కి అబాసుపాలు కాకూడదు. పైన చెప్పుకున్న ప్రత్యేక లక్షణాలు మనలో లేకపోతే మన ఇన్‌ఛార్జ్‌లకు మనస్ఫూర్తిగా సహకరిద్దాం. ఇవన్నీ తమలో ఉన్నవాళ్లు ప్రస్తుత సంస్థలో పదోన్నతి కోసం ప్రయత్నించొచ్చు. లేదా వేరే కంపెనీల్లో ఛాన్స్ ఉంటే ట్రై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.