Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!

Government Jobs

Government Jobs

Government Jobs Rules: ఒక చిన్న తప్పు కొంపముంచుతుంది.. కష్టపడి సంపాదించుకున్న ప్రభుత్వ ఉద్యోగం క్షణాల్లో చేజారిపోతుంది! పోటీ పరీక్షల్లో విజయం సాధించి, అన్ని రౌండ్లు దాటి పోస్టింగ్ కోసం ఎదురుచూసే అభ్యర్థులు చేసే కొన్ని పొరపాట్లు వారి కెరీర్‌కే ముప్పు తెస్తాయి. దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వడం, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడం లేదా పరీక్షా నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో యూపీఎస్సీ, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

కొందరు అభ్యర్థులు ఉద్యోగం దక్కించుకోవాలనే ఆత్రుతతో నకిలీ డిగ్రీలు, కుల ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర తప్పుడు డాక్యుమెంట్లు ఇస్తుంటారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) మార్గదర్శకాల ప్రకారం.. ఇలా తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందినట్లు తేలితే సదరు ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించడమో లేదా డిస్మిస్ చేయడమో జరుగుతుంది. అదే పర్మినెంట్ ఎంప్లాయ్ అయితే నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు.

ఇక ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపేటప్పుడు విద్యార్హతలు, వయసు, కేటగిరీ లాంటి వివరాలను చాలా జాగ్రత్తగా, కచ్చితంగా నమోదు చేయాలి. దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వడం, ముఖ్యమైన విషయాలు దాచడం లేదా మార్పులు చేసిన డాక్యుమెంట్లు అటాచ్ చేయడం చేస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. ఇలాంటి తప్పులు చేస్తే అభ్యర్థిత్వాన్నే రద్దు చేయడంతో పాటు, భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా కొన్ని సంవత్సరాల పాటు లేదా శాశ్వతంగా నిషేధించే అవకాశముంది.

ఇది కేవలం అప్లికేషన్ దశకే పరిమితం కాదు.. పరీక్ష హాల్‌లోనూ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఎగ్జామ్ సెంటర్‌లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తీసుకెళ్లడం పెద్ద సమస్యకు దారితీస్తుంది. యూపీఎస్సీ పరీక్షల రూల్స్ ప్రకారం ఇలాంటి నిషేధిత పరికరాలు ఉంచుకున్నా లేదా పరీక్షా నియమాలను ఉల్లంఘించినా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో పాటు, భవిష్యత్ పరీక్షల నుంచి డిబార్ చేయడం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటి చర్యలు తీసుకుంటారు. అందుకే హాల్ టికెట్‌పై ఉండే ప్రతి ఒక్క సూచనను అభ్యర్థులు శ్రద్ధగా చదువుకోవాలి.

కొంతమంది పరీక్ష రాసి సెలెక్ట్ అయినప్పటికీ.. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అనర్హులని తేలుతుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత షరతులన్నింటికీ అభ్యర్థి నూటికి నూరు శాతం సరిపోలాలి. పరిశీలనలో ఏ చిన్న లోపం బయటపడినా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలినా అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేస్తారు. అందుకే అప్లై చేసే ముందే వయసు, విద్యార్హతలు, అనుభవం వంటి అన్ని అర్హతలను సరిచూసుకోవడం చాలా ముఖ్యం. కేవలం ఉద్యోగం వచ్చేంతవరకే కాకుండా, కొలువు సాధించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ రూల్స్, ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగంలో చేరిన తర్వాత తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినా లేదా నిబంధనలు అతిక్రమించినా శాఖాపరమైన చర్యలు తప్పవు. తప్పు తీవ్రతను బట్టి, వర్తించే సర్వీస్ రూల్స్ ఆధారంగా శాఖాధికారులు నిర్ణయం తీసుకుంటారు.

ఇలాంటి ఇబ్బందులు ఏవీ రాకుండా ఉండాలంటే అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏ నోటిఫికేషన్ అయినా సరే దరఖాస్తు చేసే ముందే దాన్ని క్షుణ్ణంగా చదవాలి. అన్ని ధ్రువీకరణ పత్రాల్లో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. రిజర్వేషన్లు లేదా ఇతర ప్రయోజనాల కోసం కేవలం ఒరిజినల్, సరైన సర్టిఫికెట్లను మాత్రమే సమర్పించాలి. ఎగ్జామ్ హాల్‌లో హాల్ టికెట్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. అర్హతలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, నిబంధనలకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కూడా తేలికగా తీసుకోకూడదు.