Google Top Employer: మనకు ఏది అవసరమైనా వెంటనే సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను ఆశ్రయిస్తాం.. ఇప్పుడు కొంత పరిస్థితి మారినా..? ఏ డౌట్ వచ్చినా.. గూగుల్‌ను అడగాల్సిందిఏ.. అయితే, భారతదేశంలో ఉద్యోగం చేయడానికి అత్యంత ఆకర్షణీయమైన సంస్థ ఏదంటే చాలా మంది గూగుల్ పేరునే చెబుతున్నారు. ఇదే విషయాన్ని రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (REBR) 2026 నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది విడుదలైన నివేదికలో గూగుల్ దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎంప్లాయర్ బ్రాండ్‌గా నిలిచింది. టాటా గ్రూప్ రెండో స్థానంలో, అమెజాన్ మూడో స్థానంలో నిలవగా, ఉద్యోగుల అభిరుచులు గతంతో పోలిస్తే గణనీయంగా మారుతున్నాయని నివేదిక వెల్లడించింది.
భారీ స్థాయిలో నిర్వహించిన సర్వే
ఈ నివేదిక కోసం రాండ్‌స్టాడ్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు 3,500 మంది ఉద్యోగులు, ఉద్యోగార్థులను సర్వే చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో భాగం. మొత్తం 1.75 లక్షల మందికి పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఉద్యోగులు ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు? ఏ కారణాలతో ఉద్యోగాలు మారుతున్నారు? అనే విషయాలను ఈ అధ్యయనం విశ్లేషించింది.
రాండ్‌స్టాడ్ నివేదిక ప్రకారం భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్
1. గూగుల్
2. టాటా గ్రూప్
3. అమెజాన్
4. శాంసంగ్ ఇండియా
5. ఇన్ఫోసిస్
6. రిలయన్స్ ఇండస్ట్రీస్
7. ఐటీసీ గ్రూప్
8. హిందుస్థాన్ యూనిలీవర్
9. మహీంద్రా & మహీంద్రా
10. డెల్ టెక్నాలజీస్
ఉద్యోగం మారేందుకు ప్రధాన కారణాలు ఇవే
భారతీయ ఉద్యోగుల్లో దాదాపు సగం మంది వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఉద్యోగం వదిలేయడానికి పని-జీవిత సమతుల్యత లేకపోవడం (49%) ప్రధాన కారణంగా నిలిచింది. ఆ తర్వాత కెరీర్ పురోగతికి అవకాశాలు లేకపోవడం (42%), తక్కువ జీతం (41%) కారణాలుగా పేర్కొన్నారు. ఇక, వయస్సు పరంగా చూస్తే, మిలీనియల్స్ ఉద్యోగం మారేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వారిలో 43 శాతం మంది కెరీర్ వృద్ధి లేకపోవడాన్ని ప్రధాన కారణంగా పేర్కొన్నారు. అదే సమయంలో జెన్ Zలో 42 శాతం, జెన్ Xలో 39 శాతం మంది కూడా ఇదే కారణాన్ని వెల్లడించారు.
కేవలం జీతం కాదు.. ఉద్యోగులు కోరుకుంటున్నది ఇదే
ప్రస్తుతం ఉద్యోగులు కేవలం అధిక జీతం ఇచ్చే సంస్థలకే కాకుండా, కెరీర్‌లో ఎదిగే అవకాశాలు, గౌరవప్రదమైన కార్యాలయ వాతావరణం, ఆరోగ్య ప్రయోజనాలు, అనువైన పని విధానం, పని-జీవిత సమతుల్యత వంటి అంశాలను కూడా సమానంగా పరిగణిస్తున్నారు. నివేదిక ప్రకారం, 47 శాతం మంది ఉద్యోగులు మంచి జీతంతో పాటు పనితీరుకు గుర్తింపు, పదోన్నతి అవకాశాలను అత్యంత కీలకంగా భావిస్తున్నారు. అలాగే 46 శాతం మంది కంపెనీ నుంచి పారదర్శకమైన, నిజాయితీతో కూడిన సమాచారాన్ని అందుకోవడం తమ విశ్వాసాన్ని పెంచుతుందని తెలిపారు.
డిజిటల్ ఉద్యోగుల అభిరుచులు భిన్నం
డిజిటల్ రంగంలో పనిచేసే ఉద్యోగుల ప్రాధాన్యతలు కొంత భిన్నంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. వీరు మంచి జీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూనే, కెరీర్ పురోగతికి అవకాశాలు లేకపోతే వెంటనే ఉద్యోగం మార్చేందుకు సిద్ధమవుతున్నారు. డిజిటల్ ఉద్యోగుల్లో 55 శాతం మంది కెరీర్ వృద్ధి లేకపోవడమే ఉద్యోగం మారడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ శాతం ఆపరేషనల్ ఉద్యోగుల్లో 40 శాతం, ఇతర వృత్తి నిపుణుల్లో 43 శాతంగా ఉంది.
హైబ్రిడ్ వర్క్‌కు పెరుగుతున్న ఆదరణ
భారత్‌లో హైబ్రిడ్ వర్క్ కల్చర్ వేగంగా విస్తరిస్తోందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 42 శాతం మంది ఉద్యోగులు హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నారు. అంటే, కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. తరాల వారీగా చూస్తే, జెన్ Xలో 51 శాతం, జెన్ Zలో 63 శాతం, మిలీనియల్స్‌లో 62 శాతం మంది కనీసం కొంత సమయం ఇంటి నుంచే పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
కంపెనీలకు నిపుణుల సూచన
రాండ్‌స్టాడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ్ అయ్యర్ మాట్లాడుతూ, ఉద్యోగుల అవసరాలు వేగంగా మారుతున్నాయని, అందుకు అనుగుణంగా సంస్థలు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కెరీర్ వృద్ధి, సౌకర్యవంతమైన పని విధానం, మెరుగైన కార్యాలయ సంస్కృతి, ఆరోగ్య ప్రయోజనాలు, పారదర్శకత, పోటీ జీతభత్యాలు అందించే సంస్థలే భవిష్యత్తులో ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించి నిలబెట్టుకోగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

