Site icon NTV Telugu

Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

Exam Anixety

Exam Anixety

AP-TS SSC Exams: 10వ తరగతి చదువుతున్న ఐశ్వర్యకు ఎగ్జామ్‌ ఫీయర్‌ ఫుల్లుగా పట్టుకుంది. పుస్తకాలు తెరిచినా మనసు చదువుపై నిలబడటం లేదు, పరీక్షల గురించి ఆలోచిస్తే గుండె వేగంగా కొట్టుకోవడం, తప్పు చేస్తానేమో అనే భయం మళ్లీ మళ్లీ వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితి ఐశ్వర్యకే కాదు, పరీక్షల సమయం దగ్గరపడితే చాలా మంది విద్యార్థులు అనుభవించే సాధారణ సమస్య ఇది. మంచి మార్కులు రావాలనే ఒత్తిడితో పాటు తల్లిదండ్రులు, టీచర్ల అంచనాలు స్టూడెంట్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటు రెండు తెలుగురాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు దగ్గరపడుతన్నాయి. దీంతో విద్యార్థులు ప్రిపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు. అయితే వారిలో చాలామందిని ఈ ఎగ్జామ్‌ యాంగ్జైటీ(Anxiety) వేధిస్తోంది. ఇంతకీ ఈ యాంగ్జైటిని ఎలా తట్టుకోవాలి? ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

లెక్కలు ఏం చెబుతున్నాయ్?

యాంగ్జైటీని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా కొన్ని అధికారిక లెక్కల గురించి అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా విద్యార్థులపై జరిగిన కొన్ని సర్వేల ప్రకారం దాదాపు 60శాతం మంది పరీక్షల సమయంలో నిద్రలేమి సమస్యను అనుభవిస్తున్నారు. 40శాతం మందికి ఆకలి తగ్గడం కనిపించింది. 10 మందిలో ముగ్గురు విద్యార్థులు తాము ఎంత చదివినా బుర్రకు ఎక్కడంలేదనే భావనలోనే ఉంటున్నారు. ఇది చదువులో లోపం కాదు. ఇది యాంగ్జైటి సైకిల్‌లో భాగం. నిజానికి అతిగా ఆలోచించడమనేది భయాన్ని పెంచుతుంది. భయం శరీర స్పందనను పెంచుతుంది. ఆ స్పందన మెమరీ పవర్‌ను తగ్గిస్తుంది. మెమరీ పవర్‌ తగ్గగానే భయం మళ్లీ రెట్టింపు అవుతుంది. ఇదే యాంగ్జైటి సైకిల్ అన్నమాట.

వ్యాయామం చేయండి:

ఈ సైకిల్‌ను బ్రేక్ చేయడానికి మొదటి ఆయుధం శ్వాస. మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు శ్వాస వేగంగా ఆడుతుంది. గాలి లోపలికి బయటికి త్వరగా పోతుంది. కానీ మనం ఆ విషయాన్ని గుర్తించం. మనం శ్వాస ఎలా తీసుకుంటున్నామో ఆలోచించం. అలాంటి సమయంలో ఒక చిన్న ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా గాలి లోపలికి పీల్చుకోవాలి. మనసులో ఒకటి, రెండు, మూడు, నాలుగు అని లెక్కపెట్టాలి. తర్వాత ఆ గాలిని కాసేపు ఉంచాలి. ఆ తర్వాత మెల్లగా బయటకు వదలాలి. ఇలా కొన్ని సార్లు చేస్తే గుండె వేగం తగ్గుతుంది. మనసు కాస్త ప్రశాంతంగా మారుతుంది. ఆ తర్వాత మెదడు మళ్లీ స్పష్టంగా ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇది చాలా చాలా ఈజీ పద్ధతి.

చదవును విభజించాలి :

ఇక రెండోది చదివే విధానం. మొత్తం సిలబస్‌(Syllabus)ను ఒక కొండలా చూస్తే భయం పెరుగుతుంది. కానీ అదే సిలబస్‌ను చిన్న భాగాలుగా విభజిస్తే అది ఈజీ అవుతుంది. ఉదయం ఒక అంశం. మధ్యాహ్నం రివిజన్‌. సాయంత్రం సెల్ఫ్‌ టెస్ట్. 45నిమిషాల చదువుకు 5నిమిషాలు విరామం తీసుకునే విధానం మెదడుకు విశ్రాంతినిస్తుంది. ఒక రోజుకు మూడు టార్గెట్లు పూర్తి చేస్తే వారానికి 21 టార్గెట్లు పూర్తి అవుతాయి. సంఖ్యలు చిన్నవే. కానీ ప్రభావం పెద్దది. చిన్న విజయాలు పెద్ద నమ్మకాన్ని కడతాయి.

ఇతరులతో పోల్చవద్దు:

పోలిక అనే శత్రువు గురించి కూడా తెలుసుకోవాలి. అతను పది గంటలు చదివాడట. ఆమెకు కోచింగ్ ఉందట. అతనికి అన్ని ఛాప్టర్లు పూర్తయ్యాయట. ఇలాంటి మాటలు పిల్లలపై ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా చేస్తాయి. ఇక్కడ పేరెంట్స్, టీచర్స్ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విద్యార్థి పరిస్థితి వేరు. ప్రతి ఇంటి వాతావరణం వేరు. ప్రతి మెదడు గ్రహించే వేగం వేరు. మీరు నిన్న ఎంత చదివారు. ఈరోజు అంతకంటే కొంచెం ఎక్కువ చదివారా? అదే నిజమైన పురోగతి. పోటీ పక్కవాడితో కాదు. పోటీ నిన్నటి మీతో మీకే ఉండాలి.

Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

నిద్ర, తిండి తగినంత అవసరం:

ఇక నిద్ర గురించి క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఆరు గంటల కంటే తక్కువ నిద్ర తీసుకునే విద్యార్థుల్లో మెమరీ పవర్‌ స్పష్టంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రంతా మేల్కొని చదివితే ఉదయం మెదడు అలసటతో ఉంటుంది. అలసిన మెదడు వేగంగా పనిచేయదు. కాబట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అనేది విలాసం కాదు. అది అవసరం. అటు ఆహారం కూడా ప్రభావం చూపుతుంది. నీరు తక్కువగా తాగితే అలసట పెరుగుతుంది. తేలికైన ఆహారం తీసుకుంటే శరీరం భారంగా అనిపించదు. రోజుకు కనీసం 20 నిమిషాలు నడక చేసినా రక్తప్రసరణ మెరుగవుతుంది. శరీరం కదిలితే మనసు కూడా కదులుతుంది. ఒత్తిడి ఉండదు.

ఎగ్జామ్‌ హాల్‌లో టెన్షన్ వద్దు:

మరోవైపు పరీక్షా హాల్‌లో అడుగు పెట్టిన క్షణం మరో యుద్ధం మొదలవుతుంది. క్వశ్చన్ పేపర్ చేతిలోకి వచ్చిన వెంటనే తొందరపడకూడదు. మొదటి ఐదు నిమిషాలు పూర్తిగా చదవాలి. సులభమైన ప్రశ్నలతో ప్రారంభించాలి. మొదటి సమాధానం సరిగ్గా రాయగానే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మిగతా సమాధానాలకు బలాన్ని ఇస్తుంది. ఒక ప్రశ్న వద్ద ఎక్కువ సేపు టైమ్ వేస్ట్ చేయకూడదు. ముందుకు కదలాలి. చివరి 10 నిమిషాలు పేపర్‌లో ఏం రాశామో చెక్ చేసుకోవాలి.

క్రమశిక్షణ ముఖ్యం:

ఇప్పుడు ఒక పెద్ద నిజాన్ని తెలుసుకోవాలి. పదో తరగతి ముఖ్యమైన దశ కానీ అది జీవితానికి చివరి గమ్యం కాదు. మార్కులు ఒక కొలమానం మాత్రమే. అన్నటికంటే హార్డ్‌ వర్క్‌ ఇంపార్టెంట్.. ఒక పరీక్ష ఫలితం తాత్కాలికమే, కానీ క్రమశిక్షణ జీవితాంతం తోడుంటుంది. ఈ సమయంలో మీరు నేర్చుకునే మానసిక బలం తర్వాతి ప్రతి పరీక్షలో ఉపయోగపడుతుంది. ఆందోళన పూర్తిగా పోవాల్సిన అవసరం లేదు. అది కొంచెం ఉండాలి. అది మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచాలి. కానీ అది మీ మీద అధికారం సాధించకూడదు. అప్పుడే మార్కులతో పాటు నాలెడ్జ్‌ని కూడా మనం గెయిన్‌ చేయవచ్చు.

10th Halltickets : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే..!

Exit mobile version