Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aryan Shukla: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా లెక్కలు వేసినా, 16 ఏళ్ల ఆర్యన్ శుక్లా తన మనసుతోనే అంతకంటే వేగంగా క్షణాల్లో సమాధానం చెప్పగలడు. మహారాష్ట్రలోని నాశిక్‌కు చెందిన ఈ బుడ్డోడి ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. చిన్న వయసులోనే అసాధారణమైన జ్ఞాపకశక్తి, కౌంటింగ్ వేగంతో ఏకంగా తొమ్మిది గిన్నిస్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 12 ఏళ్ల ప్రాయంలోనే మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌ను గెలుచుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇతడిని ఇప్పుడు అందరూ భారత్ గర్వించదగ్గ ‘హ్యూమన్ కాలిక్యులేటర్’ అని పిలుస్తున్నారు. ఈ అద్భుత విజయాల వెనుక కేవలం లెక్కల మీద ఆసక్తి మాత్రమే కాదు, ఏడేళ్ల అంకితభావం, ఎలాంటి ఒత్తిడి పెట్టని తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నాయి.
ఆర్యన్ ప్రయాణం ఆరేళ్ల వాయసులోనే సాధారణమైన కుతూహలంతో ప్రారంభమైంది. అంకెలు, లెక్కల పట్ల ఆసక్తి చూపించిన ఆర్యన్లోని ప్రత్యేకతను అతని తల్లిదండ్రులు త్వరగానే గుర్తించారు. సాధారణ పిల్లలలా కాకుండా ఇతను ఏదో విభిన్నంగా చేస్తున్నాడని గ్రహించి, తండ్రి నితిన్ శుక్లా వెంటనే ఆ బాలుడిని పోటీలకు తీసుకెళ్లడం ప్రారంభించారు. అలా 2018లో ఇస్తాంబుల్‌లో జరిగిన మెమోరియాడ్ టర్కీ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో ఎనిమిదేళ్ల ఆర్యన్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి 7 బంగారు పతకాలతో పాటు మొత్తం 10 పతకాలు సాధించి రెండు చిన్నారుల ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.
Also Read
- Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
- November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
- School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
ఈ అంతర్జాతీయ ప్రయాణంలో భాగంగా జూలై 2022లో జర్మనీలోని పాడెర్బోర్న్లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో ఆర్యన్ సంచలనం సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 40 మంది మేధావులతో పోటీపడి కేవలం 12 ఏళ్ల వయసులోనే ఛాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ పోటీల్లో జపాన్ జట్టుదే పూర్తి ఆధిపత్యం ఉండేది. ఆ ఆధిపత్యాన్ని చెరిపేస్తూ ఆర్యన్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 2024లో జరిగిన పోటీల్లో తన టైటిల్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా, 900 మార్కులకు గానూ 819.84 మార్కులు సాధించి ఓవరాల్ ర్యాంకింగ్, వెర్సటైలిటీ, అడిషన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్స్, కాలెండర్ డేట్స్ – ఇలా ఆరు విభాగాల్లోనూ ట్రోఫీలను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా వివిధ విభాగాల్లో ఐదు ప్రపంచ రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు.
ఫిబ్రవరి 2024లో ఇటాలియన్ టెలివిజన్ షో ‘లో షో డీ రికార్డ్’ ద్వారా గిన్నిస్ రికార్డుల పరంపరను ప్రారంభించాడు. కేవలం 25.19 సెకన్లలో 50 ఐదు అంకెల సంఖ్యలను మనసులోనే కూడి మొదటి గిన్నిస్ రికార్డు సాధించాడు. అదే ఏడాది డిసెంబర్ 4న దుబాయ్‌లోని గిన్నిస్ రికార్డ్స్ కార్యాలయంలో ఒక్కరోజే ఏకంగా ఆరు రికార్డులను తిరగరాశాడు. 50 ఐదు అంకెల సంఖ్యలను 18.71 సెకన్లలో, 100 నాలుగు అంకెల సంఖ్యలను 30.9 సెకన్లలో, 200 నాలుగు అంకెల సంఖ్యలను నిమిషం 9.68 సెకన్లలో కూడి అందరినీ విస్మయపరిచాడు. అలాగే పెద్ద సంఖ్యల గుణకారాలు, భాగాహారాల్లోనూ రికార్డులు సృష్టించాడు. ఆ తర్వాత ఏప్రిల్ 2026లో ఇటలీలో జరిగిన పర్యటనలో పది 8-అంకెల సంఖ్యలకు వర్గమూలాలను 71.22 సెకన్లలో కనుగొని, మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇన్ని విజయాలు సాధించినప్పటికీ, ఆర్యన్‌పై తల్లిదండ్రులు ఎప్పుడూ ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ఫలితాల కంటే కష్టపడటమే ముఖ్యమని నమ్మించారు. ప్రస్తుతం నాశిక్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న ఆర్యన్, పదో తరగతిలో 97 శాతం మార్కులు సాధించాడు. గణితం, ఫిజిక్స్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న మార్పులను కూడా ఆసక్తిగా గమనిస్తుంటాడు. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా మనిషి మెదడు సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని, టెక్నాలజీ వైఫల్యం చెందినప్పుడు మానవ నైపుణ్యాలే అతిపెద్ద బ్యాకప్‌గా నిలుస్తాయని అతని తండ్రి నితిన్ నమ్ముతారు. కేవలం గెలుపులకే పరిమితం కాకుండా, ఆర్యన్ ఇప్పుడు తోటి పిల్లలకు మెంటల్ మ్యాథ్స్‌లో గురువుగా మారుతున్నాడు. ‘గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్’ (GMCA) వ్యవస్థాపక బోర్డు సభ్యుడిగా ఉంటూ ఈ విద్యను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెస్తున్నాడు. ఆన్ లైన్ తరగతుల ద్వారా పిల్లల్లోని అంకెల భయాన్ని పోగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. 2025 నవంబర్‌లో సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ‘మిస్క్ గ్లోబల్ ఫోరమ్’లో ప్యానెలిస్ట్‌గా పాల్గొని విద్యలో మెంటల్ కాలిక్యులేషన్ ప్రాముఖ్యతపై ప్రసంగించాడు. ఇక, పిల్లలను పెంచే విషయంలో ఆర్యన్ తల్లిదండ్రులు అందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. తల్లిదండ్రులు తమ అసంపూర్తి కలలను పిల్లలపై రుద్దకూడదని, వారి ఆసక్తులను గుర్తించి తగిన సమయం ఇవ్వాలని చెబుతున్నారు. ఆర్యన్‌కు లెక్కలంటే ఇష్టం కాబట్టి, ఫలితాలు ఎలా ఉన్నా ఏడేళ్లుగా వారు అండగా నిలిచారు. చివరికి ఆ ఆసక్తే అతడిని ప్రపంచ ప్రఖ్యాతి గాంచేలా చేసింది. టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతున్నా, జిజ్ఞాస, క్రమశిక్షణతో కూడిన అభ్యాసం ఉంటే మనిషి ఏ స్థాయికైనా చేరుకోవచ్చని ఆర్యన్ ప్రయాణం నిరూపిస్తోంది.
తాజావార్తలు
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!