Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్

  • న్యూయార్క్‌లో నవరాత్రి వేడుకలు
  • భారతీయులతో కలిసి గర్బా ఆడిన జోహ్రాన్ మమ్దానీ
  • పూజారి ఆశీర్వాదం తీసుకున్న న్యూయార్క్ మేయర్
Zohran Mamdani

Zohran Mamdani

న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ భారతీయ సమాజంతో కలిసి నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ గుజరాతీ జానపద నృత్యమైన గర్బా ఆడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లటి సూట్‌ వేసుకుని, సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా గర్బా ఆడుతూ కనిపించారు. గర్బా నృత్యంలో పాల్గొన్న అనంతరం మమ్దానీ ఓ ఆలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ పూజారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

నవరాత్రి శుభాకాంక్షలు

నృత్య వేడుకల్లో పాల్గొనడమే కాకుండా.. మమ్దానీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ వేదిక ద్వారా హిందూ సమాజానికి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలు, సంప్రదాయాల వైవిధ్యాన్ని తన సందేశంలో ప్రస్తావించారు. దుర్గాపూజ, దసరా, దశైన్, నవరాత్రి వంటి పండుగలతో పాటు సిందూర్ ఖేలా, గోలు బొమ్మల అలంకరణ వంటి ఆచారాలను గుర్తుచేశారు.

“ఈ వారం మన హిందూ పొరుగువారు దుర్గాదేవిని ఆరాధిస్తూ నవరాత్రి పండుగను జరుపుకుంటున్నారు. గర్బా నృత్యాలు చేస్తారు. సిందూర్ ఖేలా ద్వారా దుర్గాదేవిని పూజిస్తారు. పెద్దల నుంచి తిలకం (టికా) స్వీకరిస్తారు. తమ ఇళ్లలో గోలు బొమ్మలను ఏర్పాటు చేస్తారు. ఇలా ఎన్నో సంప్రదాయాలను పాటిస్తారు. మీ కుటుంబం ఈ పండుగను దుర్గాపూజ, దశైన్, దసరా లేదా నవరాత్రి అని ఏ పేరుతో పిలిచినా.. ఈ పండుగ ఆత్మపరిశీలనకు, నూతన ఆరంభాలకు నాంది కావాలని కోరుకుంటున్నాను” అని మమ్దానీ తన పోస్టులో పేర్కొన్నారు.

భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్‌లోని దక్షిణాసియా సమాజానికి చెందిన పలు సాంస్కృతిక వేడుకల్లో గతంలోనూ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి దీపావళి, రక్షాబంధన్ వంటి పండుగలను కూడా జరుపుకున్నారు. న్యూయార్క్ నగరానికి తొలి దక్షిణాసియా సంతతికి చెందిన, భారతీయ అమెరికన్, ముస్లిం మేయర్‌గా మమ్దానీ గుర్తింపు పొందారు. ప్రముఖ భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్, ఉగాండాకు చెందిన విద్యావేత్త మహమూద్ మమ్దానీ ఆయన తల్లిదండ్రులు. ముస్లిం, హిందూ సంప్రదాయాల మధ్య పెరగడం తన విలువలు, ఆలోచనా విధానంపై ప్రభావం చూపిందని మమ్దానీ గతంలో పలు సందర్భాల్లో ప్రస్తావించారు.