NTV Telugu Site icon

Donald Trump: ఉక్రెయిన్ శాంతి చర్చల్లో జెలెన్ స్కీ అంత ముఖ్యం కాదు..

Donald Trump

Donald Trump

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నుంచి తాను ఎన్నికైన వెంటనే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో శాంతి చర్చలపై మాట్లాడారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా శాంతి స్థాపనపై చర్చించారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జెలెన్ స్కీని నియంతగా పోల్చుతూ, ఉక్రెయిన్‌ని నాశనం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: MahaKumbh Mela: అదే గంగానది ప్రత్యేకత.. కోట్ల మంది స్నానం చేసినా స్వచ్ఛంగా నీరు..

తాజాగా, ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ, యుద్ధాన్ని ముగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు అమెరికా నాయకత్వం వహిస్తుందని ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో జరిగే చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హాజరుకావడం తప్పనిసరి అని తాను భావించడం లేదని ట్రంప్ శుక్రవారం అన్నారు. అతడు మూడు సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నాడు, అతడికి ఒప్పందాలు చేసుకోవడం అతడికి చాలా కష్టం అని ట్రంప్ అన్నారు.

“నేను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చాలా మంచి చర్చలు జరిపాను, ఉక్రెయిన్‌తో నేను అంత మంచి చర్చలు జరపలేదు. వారికి ఎలాంటి అవకాశాలు లేవు, కానీ వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ మేము దీనిని కొనసాగించనివ్వబోము” అని ట్రంప్ శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన అమెరికా గవర్నర్ల సమావేశంలో ఉక్రెయిన్ గురించి అన్నారు. 2022లో ప్రారంభమైన యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ రష్యాతో చర్చలు జరుపుతున్నారని, ఈ విషయంలో తమను పక్కన పెట్టారని ఉక్రెయిన్, యూరప్ ఫిర్యాదులు చేస్తున్నాయి. సౌదీ అరేబియా వేదికగా ఈ వారం రష్యా ఉన్నతస్థాయి దౌత్యవేత్తలు సమావేశమయ్యారు. దీనికి ఉక్రెయిన్‌ని ఆహ్వానించలేదు.