Pakistan: “పాకిస్తాన్‌లోని 4% హిందువులను సహిస్తున్నాం”.. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..

  • పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు.
  • పాకిస్థాన్‌లో 3–4% హిందువులను “సహిస్తున్నాం” అని వ్యాఖ్య.
  • 2023 అధికారిక జనగణన ప్రకారం హిందువుల జనాభా 2.17%.
Pakistan

Pakistan

Pakistan:  పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో ఉన్న హిందువులను ముస్లింలు ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. పాక్‌లో 3-4 శాతం హిందువులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే, పాకిస్తాన్ అధికారిక జనగణన ప్రకారం, పాక్‌లో 2.17 హిందువులు మాత్రమే ఉన్నారు. పాక్‌లో ప్రస్తుతం సుమారుగా 52 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వీరంతా ప్రధానంగా సింధ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు.

ఆగస్టు 14న ఇస్లామాబాద్‌లో జరిగిన యాద్గార్-ఎ-ఫతా కార్యక్రమంలో జర్దారీ ప్రసంగించారు. 2025లో భారత్‌తో జరిగిన స్వల్పకాలిక సైనిక ఘర్షణను పాకిస్థాన్ “మార్కా-ఎ-హక్”(సత్య యుద్ధం)గా పేర్కొంటోంది. భారత్ గురించి మాట్లాడుతూ.. భారతీయులు వేరే దృక్పథంతో ఉన్నారని, వారికి తమదైన ఎజెండా ఉందని, వారు అఖండ భారత్‌ను నమ్ముతారని, కానీ కొన్ని విషయాలను వారు మరిచిపోతున్నారని అన్నారు. ఇదే కాకుండా ముస్లింలు 3-4 శాతం హిందూ జనాభాను సహిస్తున్నారని, వారు పాకిస్తాన్‌లో చాలా మంచిగా ఉన్నారని, వారు భారత్ కన్నా పాకిస్తాన్‌లో ఉండేందుకే ఇష్టపడుతారని అన్నారు.

మిస్టర్ 10% జర్దారీ:

పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ గురించి సొంతదేశంలోనే ఒక విమర్శ ఉంది. అంతా అతడిని మిస్టర్ 10%గా పిలుస్తారు. ఏ పని చేయాలన్నా ఆయనకు 10 శాతం కమిషన్ ఇవ్వాల్సిందే అని అక్కడి వారు అనుకుంటారు. అంత అవీనితి చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. భార్య బెనజీర్ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో 10% కమీషన్ తీసుకుంటారనే ఆరోపణలు రావడంతో ఈ పేరు బాగా పాతుకుపోయింది.

పాక్‌లో హిందువుల పరిస్థితి:

పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 జనగణన ప్రకారం దేశంలో 52.1 లక్షల హిందువులు ఉన్నారు. ఇందులో దాదాపు 38.68 లక్షల మందిని “హిందూ జాతి”గా, 13.49 లక్షల మందిని షెడ్యూల్డ్ కాస్ట్స్‌గా నమోదు చేశారు. 1941 జనగణనలో ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో 14.6 శాతం మంది హిందువులు ఉండేవారు. 1947 నుంచి 2023 నాటికి ఇది 2.17కు పడిపోయింది. ఆ సమయంలో పాక్‌లో తూర్పు పాకిస్తాన్‌గా బంగ్లాదేశ్ అంతర్భాగంగా ఉండేది.

పాకిస్తాన్‌లో హిందూ, క్రైస్తవ బాలికలు, యువతుల బలవంతపు మత మార్పిడులు, అపహరణలు, బలవంతపు వివాహాలు నిత్యకృత్యంగా మారాయి. పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ కూడా మైనారిటీ మహిళలు, బాలికల పరిస్థితిపై ఆందోళనలు నమోదు చేసింది. యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం (USCIRF) కూడా మతపరమైన మైనారిటీలపై హింస, బలవంతపు మత మార్పిడుల కేసులను ప్రస్తావించింది.