XI Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి జిన్‌పింగ్‌ను స్వాగతించారు. ఇద్దరు నేతలు వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)గురించి చర్చంచారు. AI అభివృద్ధి ఎప్పటికీ మానవ నియంత్రణలోనే ఉండేలా అమెరికా, చైనా కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు.
‘‘AI మంచి కోసం అభివృద్ధి చేసి, నిర్వహించే సామర్థ్యం, బాధ్యత మనకు ఉంది. AI ఎల్లప్పుడూ మనిషి కంట్రోల్‌లోనే ఉండేలా చూడాలి’’ అని జిన్‌పింగ్ అన్నారు. ట్రంప్, జిన్‌పింగ్ భేటీలో ఏఐ అంశం కీలకంగా మారింది. రెండు దేశాలు ఏఐ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న తరుణంలో చైనా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల తలెత్తే భద్రతా ప్రమాదాలపై పరస్పర చర్చ అవసరమని ఇద్దరు నేతలు భావించారు. జిన్‌పింగ్‌తో భేటీకి ముందు ట్రంప్ తన ట్రూత్‌సోషల్ వేదికగా ‘‘సూపర్ ఇంటెలిజెన్స్ (SI)’’ చర్చల్లో ప్రధానంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ గవర్నెన్స్ విషయంతో ప్రస్తుత విధానాన్ని మార్చకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, ఈ వారంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, చైనా వసైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్ మధ్య జరిగిన చర్చల్లో ఏఐ సంబంధిత ప్రమాదాలపై నోటిఫికేషన్ మెకానిజం ఏర్పాటు చేసే ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఏఐ ఘటనపై ఇరు దేశాలు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలనే విధానం ఇందులో ఉంది. అయితే దీనిపై రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు జరగలేదు.

