NTV Telugu Site icon

USA: అమెరికా ఆడుతున్న ఆటకు ప్రపంచం సర్వనాశనం

America Oil Refineries

America Oil Refineries

ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోయి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్న వారికి రాబోయే రోజుల్లో పెద్ద షాక్‌ తప్పకపోవచ్చు. వచ్చే ఆరు నెలల్లో ప్రపంచాన్ని చమురు ధరలు కమ్మేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ చమురు ధర 200 డాలర్లు దాటవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది శరాఘాతం వంటిది. వాటిని ఆర్థిక సంక్షోభంలో పడేస్తుంది.

చమురు ధరల భారాన్ని మోసే శక్తి చాలా దేశాలకు లేదు. అయితే రెండు దేశాలకు మాత్రం ఆ బాధ లేదు. ఒకటి అమెరికా, ఇంకొకటి గ్రేట్‌ బ్రిటన్‌. ఈ రెండూ చమురు ఉత్పత్తిలో మిగులు దేశాలు. అందులో కొంత ఎగుమతి కూడా చేస్తాయి. కాబట్టి చమురు ధరలు పెరగటం వల్ల వాటికి బంపర్ లాభం వస్తుంది. ఇదే కాదు ఈ రెండు దేశాలు ఆయుధ ఎగుమతిదారులు. కాబట్టి ఉక్రెయిన్‌ యుద్ధం ఎంత సుదీర్ఘంగా సాగితే వీటికి అంత లాభదాయకం. ఈ రెండు గాక మూడో లాభాన్ని కూడా ఇవి ఆశిస్తున్నాయి.

అమెరికా, బ్రిటన్‌లు రష్యాపై రాబందుల్లా కన్నేశాయి. రష్యాని ఓడించి దాన్ని ముక్కలుగా పీక్కు తినాలని వాటి ఆశ. అక్కడి ఖనిజాలు, చమురు, గ్యాస్‌తో పాటు విశాలమైన భూభాగాన్ని కొట్టేయాలని కలలు కంటున్నాయి. కానీ రష్యా వాటికి దానిని ఎప్పటికీ పగటి కలగానే ఉంచుతుంది. ఎందుకంటే రష్యా పతనాన్ని చూడడానికి అమెరికా, బ్రిటన్‌తో పాటు ప్రపంచంలో ఏ దేశమూ మిగలదు.

ఏది ఏమైనప్పటికీ ఈ యుద్దంలో విజేతగా మిగిలేది ఒక్కరే అన్న జాన్ మెయర్‌షీమర్ మాటలు నిజం. అమెరికా చేసిన భయంకరమైన వ్యూహాత్మక తప్పిదాలేమిటో చెప్పటానికి ఈ మాటలు చాలు. జాన్ మెయర్‌షీమర్ అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, అంతర్జాతీయ వ్యవహరాల నిపుణులు. ఖచ్చితంగా యుద్ధం అంటే వినాశనమే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటి నుంచి అమెరికా ఉక్రెయిన్‌ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ వచ్చింది. అలా 2014లో అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టి ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధానికి బీజం వేసింది. కాబట్టి అమెరికా తన వికృత ఆటను ఆపటం ఒక్కటే ఇప్పుడు మార్గం.

యుద్ధం లాభదాయకమని ఎప్పుడూ అనుకోవద్దని అమెరికా కాంగ్రెస్‌ మాజీ సభ్యుడు రోనాల్డ్ ఎర్నెస్ట్ పాల్ వ్యాఖ్యానించారు. ఈ యుద్ధ ఫలితాలు చాలా మంది అనుకున్నదానికంటే ఇంకా దారుణంగా ఉండవచ్చు. భౌగోళిక రాజకీయ వ్యూహకర్త (జియోపొలిటిలక్‌ స్ట్రాటజిస్ట్‌) పీటర్ జీహాన్ మాటలు వింటే ఇదే అనిపిస్తుంది. ఆయన విశ్లేషణ ప్రకారం యుద్ధ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది.

ఈ సంక్షోభం వేడి శీతాకాలం ప్రారంభంలో కొంతవరకు అనుభవంలోకి రావచ్చు. ఎందకంటే అప్పటికి రష్యాలో చమురు, గ్యాస్ పైప్‌ లైన్లు గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. 1989లో సోవియట్‌ విచ్ఛిన్న సమయంలో కూడా ఇలాగే జరిగింది. పెర్మాఫ్రాస్ట్ (శాశ్వత మంచు) ప్రమాదకరంగా ఉండే ప్రాంతంలో పైపులను తిరిగి పని చేయించాలంటే నిపుణులు అవసరం అవుతారు. వారిలో ఎక్కువ మంది పశ్చిమ దేశాల వారే. అమెరికా ఆంక్షల కారణంగా వారిలో చాలా మంది రష్యా నుంచి వెళ్లిపోయారు. కనుక ఈ పైపులను చూసుకోవడానికి త్వరలో అక్కడ ఎవరూ ఉండరు. కనుక, చలికాలంలో ఈ పైపులు గడ్డకట్టడం, పగుళ్లు ఏర్పడి నిరుపయోగంగా మారవచ్చు. ఘనీభవించిన, పగిలిన పైపులు తిరిగి పనిచేయడానికి దాదాపు పదేళ్లు పట్టవచ్చు.

రష్యా నుంచి చమురు సరఫరా నిలిచిపోతే రోజుకు 4.6 మిలియన్ బ్యారెళ్ల అయిల్‌ మార్కెట్‌కు చేరదు. చమురు దిగుమతి దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. రోజుకు 14 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకునే యురోపియన్‌ యూనియన్‌ కూడా వీటిలో ఉన్నాయి. అవి దిగుమతి చేసుకునే చమురు,సహజవ వాయులో దాదాపు 40 శాతం రష్యా నుంచి దిగుమతి అవుతుంది. 10.8 మిలియన్ బ్యారెళ్ల దిగుమతులతో చైనా తర్వాతి స్థానంలో ఉంది. దీనికి రష్యా నుంచి చమురు పైప్‌లైన్ ఉంది. కానీ పర్మాఫ్రాస్ట్ స్తంభింపజేస్తే అది నిరుపయోగంగా మారుతుంది. చమురు దిగుమతిలో చైనా తర్వాత స్థానం భారత్‌ది. రోజుకు దాదాపు 4 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటోంది.

మరోవైపు అమెరికాకు ఈ చమురు బాధ లేదు. అది దిగుమతుల కంటే ఎక్కువగా ఎగుమతి చేస్తుంది కాబట్టి దీని ప్రభావం దాని మీద పడదు. కానీ రష్యా వల్ల ఏర్పడే 4.6 మిలియన్ బ్యారెల్స్ చమురు కొరతతో ఆయిల్‌ దిగుమతి దేశాలు ఇంధనం కోసం అల్లాడిపోతాయి. ఈ కొరత చమురు ధరలు మరింతగా పెరగడానికి కారణం కావచ్చు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం బ్యారెల్ ధర 200 డాలర్లు దాటవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు.

ఇరాన్, వెనిజులా రోజుకు కనీసం ఒక మిలియన్‌ బ్యారెళ్ల అదనపు చమురును ఉత్పత్తి చేసినా కూడా డిమాండు తీరదు. ఒకటి రెండు సంవత్సరాల తరువాత ఈ లోటు ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది. చమురుతో పాటుఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌- ద్రవీకృత సహజ వాయువు) ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం రష్యా సహజవాయు ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దానిలో అధికమొత్తం యూరప్‌కే వెళుతుంది. ఈ ఇంధనం లేకపోవడం వలన చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అదే జరిగితే జర్మనీలోని అలాంటి పరిశ్రమలు సగం వరకు మూతపడతాయి.

మరో మార్గంగా ఖతార్ నుంచి పైప్‌లైన్ ద్వారా యూరప్‌ గ్యాస్ పొందడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. తగినన్ని ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక సామర్థ్యం స్తంభించే ప్రమాదం ఉంది. పరిశ్రమలకు ఇంధనం అందుబాటులో ఉండదు. ఉన్నా ధరలు చాలా ఎక్కువ. వాటిని భరించే స్తోమత చాలా పరిశ్రమలకు ఉండదు.

ఈ సంక్షోభం భారతదేశ ఇంధన ఖర్చును మూడు రెట్లు పెంచుతుంది. ఫలితంగా విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోయి ఆర్థిక సంక్షోభం ముందు నిలుపుతుంది. ఐతే, చమురు, గ్యాస్ అధికంగా ఉండే మధ్యప్రాచ్యానికి దగ్గరగా ఉన్నందున ఈ విషయంలో భారత్‌ కొంత వరకు అదృష్టమే. భారత్ తన దౌత్యం ద్వారా ఇందనం పొందటం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ అది అధిక ధరలను భరించటమే పెద్ద కష్టం. పెర్మాఫ్రాస్ట్ సమస్య కారణంగా రష్యా నుండి తగ్గింపు ధరకు చమురు అవకాశం ఎక్కువ కాలం ఉండదు.

భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగం, మతవిధ్వేషాలు, ఆర్థిక మందగమనం, రైతు సమస్యలు వంటివి చమురు సంక్షోభానికి తోడై అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. ఆర్థిక సంక్షోభం తలెత్తితే గ్రామీణ ప్రాంత ప్రజల కొనుగోలు శక్తి ఘోరంగా తగ్గుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఉచిత ప్రభుత్వ పథకాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇది ప్రజలలో తీవ్ర అసంతృప్తికి దారితీయవచ్చు.

ఇంధన సంక్షోభం వల్ల జపాన్‌కు కూడా కష్టాలు తప్పవు. అది తన చమురు అవసరాలకు ఆస్ట్రేలియా మీద ఆధారపడవచ్చు.ఐతే, డిమాండ్‌కు అనుగుణంగా ఎల్‌ఎన్‌జి ధర కూడా భారీగా పెరుగుతుంది. కాబట్టి, కొన్ని దేశాలు ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి భారీగా ప్రయోజనం పొందుతాయి. ఇదే సమయంలో చమురు కొరతను అధిగమించేందుకు ప్రపంచం మరోసారి బొగ్గును ఆశ్రయించవచ్చు. అదే జరిగితే బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి ఆస్ట్రేలియాకు లాభాల పంటపండినట్టే.

బహుశా చైనా విషయంలో మాత్రం నిపుణుల అంచనాలు తప్పొచ్చు. ఎందుకంటే పెర్మాఫ్రాస్ట్ (శాశ్వత మంచు)తో వ్యవహరించడంలో చైనాకు అపారమైన అనుభవం ఉంది. అటువంటి భూ భాగాలలో రైల్వే లైన్లు, రోడ్లు, వంతెనలను నిర్మించిన ఘనత చైనాది. అంతేకాదు కఠిన పరిస్థితులను ఎదుర్కోవటానికి తెలివిగల మార్గాలను సృష్టించింది. క్వాంటం ఫిజిక్స్‌లో చైనా గ్లోబల్ లీడర్. కనుక, చైనా ఇంజనీర్లు, రష్యా ఇంజనీర్లతో కలిసి శీతాకాలంలో కూడా రష్యా నుంచి చమురు, సహజ వాయువు సరఫరా చేయించగలరు. దాంతో చైనా అకస్మాత్తుగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రక్షకుడుగా అవతరిస్తుంది. అప్పుడు యురోపియన్‌ యూనియన్‌.. అమెరికా, బ్రిటన్‌ కన్నా చైనాపై ఎక్కువ ఆధారపడివచ్చు.

ఒకవైపు పారిశ్రామిక వృద్ధికి అవరోధం.. మరోవైపు ఆహార సమస్య కూడా తలెత్తుతుంది. గోధుమలు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు ప్రపంచానికి ప్రధాన ఎరువుల సరఫరాదారులుగా రష్యా, ఉక్రెయిన్‌ ఉన్నాయి. ఈ సంక్షోభ ఫలితంగా రవాణా, పర్యాటక రంగాలపై అధిక ప్రభావం చూపుతుంది.

ఈ యుద్దంతో అమెరికా డాలర్‌పై పెద్ద దెబ్బ పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, కరెన్సీల పతనానికి దారితీస్తుంది. చైనా, రష్యా తమ యూఎస్‌ డాలర్ హోల్డింగ్‌లను తగ్గించుకోవడం ద్వారా తమను తాము రక్షించుకున్నాయి. చమురు, గ్యాస్ కొనుగోళ్లకు రూబుల్స్‌ లో చెల్లింపులు జరపాలని రష్యా అంటోంది. దాంతో రూబుల్ విలువ పెరిగింది. రూబుళ్లలో చెల్లించేందుకు జర్మనీ అంగీకరించగా మోల్డోవా, పోలాండ్ ఒప్పుకోలేదు. దాంతో రష్యా వాటికి చమురు, గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది.

శీతాకాలం రావటానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉంది. రాబోయే రెండు నెలలు మేనేజ్‌ చేసుకోవచ్చు. కానీ తరువాత ఎముకలు కొరికే చలిని భరించలేక రష్యా డిమాండ్‌కు చాలా దేశాలు తలొగ్గే పరిస్థితి ఉంది. ఇక, ప్రపంచానికి అణు ముప్పు ఎలాగూ ఉండనే ఉంది. అమెరికా చర్యలతో అది ఇంకా పెరుగుతుంది. అణు ముప్పుకు అన్నిటి కన్నా ముందు బలయ్యేది యురోపియన్‌ యూనియన్‌. అమెరికా కూడా సురక్షితంగా ఉండకపోవచ్చు. మొత్తం మీద అమెరికా, బ్రిటన్‌ ఆడుతున్న ప్రమాదకరమైన ఆట యావత్‌ ప్రపంచాన్ని బలిగొంటుంది.

Show comments