Site icon NTV Telugu

కరోనా మహమ్మారి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్నింగ్‌

కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయం అంతా ఇంత కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోతూ వచ్చిన సమయంలో.. మళ్లీ సాధారణ పరిస్థితులు రానున్నాయని ఆశగా ఎదురుచూశారు.. కానీ, కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా ఆ తర్వాత రష్యా, యూకే, అమెరికా.. ఇలా పలు దేశాల్లో క్రమంగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్‌ ఘెబ్రియేసస్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికీ వారానికి 50 వేల కరోనా బాధితులు ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు వదిలేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో.. కోవిడ్‌ మహమ్మారి తగ్గిపోయిందని భావించడం సరికాదన్నారు టెడ్రోస్‌.. ఇక, మన దగ్గర కరోనాను అంతం చేయడానికి కావాల్సినన్ని వనరులు ఉన్నాయి. ప్రభావవంతమైన ప్రజారోగ్య వనరులు, శక్తిమంతమైన మెడికల్‌ వనరులు కూడా ఉన్నాయని.. కానీ, ప్రపంచం వాటిని సరిగా ఉపయోగించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. జనాభాలో 40 శాతంపైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించిన జీ20 దేశాలు ఇకపై కోవ్యాక్స్‌పై దృష్టి సారించాలని కోరారు. పేద దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్‌ మిషన్‌కు, ఆఫ్రికా దేశాల కోసం ఆఫ్రికన్ వ్యాక్సిన్ అక్విషన్ ట్రస్ట్ (ఏవీఏటీ) అనే స్వచ్ఛంద సంస్థ చేస్తున్న వ్యాక్సిన్‌ సేకరణ కృషికి ప్రపంచదేశాలు సహకరించాలని కోరారు టెడ్రోస్‌.

Exit mobile version