ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ముప్పు ముంచుకొస్తోంది. దాదాపు 30 దేశాలకు విస్తరించి, ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వ్యాధి మంకీ పాక్స్. మంకీపాక్స్ పేరును మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్ణయించింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాయడంతో స్పందించిన డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని 30 దేశాల్లో 1,600 మందికి మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ కాగా.. మరో 1,500 అనుమానిత కేసులు ఉన్నాయి. ఐరోపా దేశాల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఈ `మంకీపాక్స్` పేరుపై అభ్యంతరాలు రావడంతో, ఆ పేరు నుంచి మంకీని తొలగించి, మరేదైనా ప్రిఫిక్స్‌ను యాడ్ చేసే అవకాశముందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే, సంబంధిత అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తరువాత, వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాత, మాత్రమే పేరు మార్పు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ప్రస్తుత పేరు భౌగోళిక ప్రాంతాలు, జంతువుల పేర్లను నివారించాలని సిఫార్సు చేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధమని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు
మంకీ పాక్స్ ప్రకంపనలు దాదాపు 39 దేశాలకు విస్తరించాయి. ఈ వ్యాధి తీవ్రతపై చర్చించి, దీన్ని అంతర్జాతీయ వైద్య ఎమర్జెన్సీగా ప్రకటించాలా? వద్దా? అని నిర్ణయించే ఉద్దేశంతో జూన్ 22న డబ్ల్యూహెచ్ఓ ఒక ఎమర్జెన్సీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు, ఈ వ్యాధి పేరు `మంకీపాక్స్`గా నిర్ధారించడంపై విమర్శలు వస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన 30 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాశారు. మంకీపాక్స్` పేరు వివక్షాపూరితంగా, అవమానకరంగా ఉందని, ఆ పేరు మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు విజ్ఞప్తి చేశారు.
వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో మంకీ పాక్స్ పేరును మార్చే విషయమై చర్చిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ వెల్లడించారు. భాగస్వామ్యులతో, నిపుణులతో, సంబంధిత స్టేక్‌హోల్డర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. జూన్ 22న జరిగే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పేరు మార్పుపై కూడా చర్చ జరుగుతుంది. త్వరలోనే కొత్త పేరును ప్రకటిస్తాం` అని డాక్టర్ టెడ్రోస్ వెల్లడించారు.
మంకీ పాక్స్ గురించి వస్తున్న వార్తల్లో ఆఫ్రికా దేశస్తులను ఎక్కువగా చూపుతున్నారని, వారి ఫొటోలనే పబ్లిష్ చేస్తున్నారని ఆఫ్రికా దేశాలకు చెందిన సైంటిస్ట్‌లు సహా వివిధ దేశాలకు చెందిన 30 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్‌వోకు తెలిపారు. ఇది వివక్షాపూరితంగా, ఒక ప్రాంత ప్రజలను టార్గెట్ చేసినట్లుగా ఉందని వివరించారు. ఆఫ్రికా, పశ్చిమాఫ్రికా, నైజీరియాలతో ప్రస్తుత మంకీపాక్స్ వ్యాప్తిని లింక్ చేస్తున్నారని ఆరోపించారు. నిజానికి, ప్రస్తుత మంకీపాక్స్ ఎక్కడ ప్రారంభమైందనే విషయంలో స్పష్టత లేదు. అయితే, ఆఫ్రికాలోనే ఇది మొదలైందన్న వాదనకే మెజారిటీ శాస్త్రవేత్తలు ఆమోదం తెలుపుతున్నారు.