Site icon NTV Telugu

Imran Khan: అవిశ్వాసం ముప్పు..! పాక్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై వ్యతిరేకత తీవ్రమైంది. అధికార కూటమి నుంచి ప్రధాన భాగస్వామ్య పార్టీలు తప్పుకోనున్నాయి. ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్‌ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఎక్కువ కావడంతో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయ‌న‌ని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. త‌న‌కు వ్యతిరేకంగా ప్రతిప‌క్ష పార్టీల‌న్నీ క‌లిసి అన్ని దారులూ వెతుకుతున్నాయని… అవిశ్వాసంలో ప్రతిప‌క్షాలు నెగ్గవ‌ని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం..!

అయితే, ఓవైపు అవిశ్వాస తీర్మానం ముప్పు పొంచిఉన్నా.. శుక్రవారం జరగనున్న అవిశ్వాస తీర్మానానికి ముందు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం చెప్పారు. జర్నలిస్టులతో సంభాషిస్తున్నప్పుడు, ప్రతిపక్షాలు తమ కార్డులన్నీ వేసినప్పటికీ, తనపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కాదని ప్రధాని చెప్పినట్లు జియో న్యూస్ నివేదించింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను. నేను చివరి బంతి వరకు ఆడతాను మరియు వారు ఒత్తిడిలో ఉన్నందున నేను ఒక రోజు ముందు వారిని ఆశ్చర్యపరుస్తాను అని పేర్కొన్నారు.. ఇంట్లో కూర్చుంటాను అని ఎవరూ తప్పుడు అభిప్రాయానికి రావొద్దు.. నేను రాజీనామా చేయను, దొంగల ఒత్తిడికి నేను రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సైన్యంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని పునరుద్ఘాటించినట్లు జియో న్యూస్ నివేదించింది. శక్తిమంతమైన సైన్యం పాకిస్థాన్‌కు కీలకమని, సైన్యాన్ని విమర్శించడం సరికాదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సైన్యం లేకపోతే, దేశం మూడు ముక్కలుగా విడిపోయేదని పేర్కొన్నారు. మరోవైపు.. ఇమ్రాన్‌ ఖాన్‌కు పాక్‌ ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. ఇటీవల స్వాత్‌లో జరిగిన బహిరంగ సభలో ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘించారని 50 వేల జరిమానా విధించింది. ఈనెల 15న కైబర్‌ పఖ్తున్కావలో స్థానిక ప్రభుత్వ ఎన్నికలు జరుగుతుండగా… ఇమ్రాన్‌ఖాన్‌ స్వాత్‌ను సందర్శించొద్దని ఈసీపీ నిషేధం విధించింది. ఈసీ ఆదేశాలు బేఖాతరు చేసి.. ఇమ్రాన్‌ఖాన్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

Exit mobile version