NTV Telugu Site icon

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో భారత, పాకిస్తాన్ విద్యార్థులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి..?

Kyrgyzstan

Kyrgyzstan

Kyrgyzstan: కిర్గిజ్ స్థాన్ దేశంలో భారత్, పాకిస్తానీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులపై దాడులకు చేస్తున్నారు. ఈ హింసాత్మక సంఘటనల్లో ఇప్పటికే ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు నివేదికలు ఉన్నాయి. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ దేశాలు తమ పౌరులను ఇళ్లకే పరిమితం కావాలని సలహాలు జారీ చేసింది. స్థానిక నివేదికల ప్రకారం… పాకిస్తానీ, ఈజిప్టు విద్యార్థులతో స్థానికులకు హాస్టల్‌లో గొడవ జరిగిందని ఇదే హింసకు కారణమైందని తెలుస్తోంది. మే 13న జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హింస రాజధాని బిష్కేక్ వీధుల్లోకి వ్యాపించింది. టైమ్స్ ఆఫ్ సెంట్రల్ ఆసియాలో ఒక నివేదిక ప్రకారం..విదేశీ విద్యార్థులు దాడికి పాల్పడ్డారని స్థానికులు ఆందోళనకు దిగారని చెప్పింది. ఈ ఘర్షణల్లో పాల్గొన్న ముగ్గురు విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉంటున్న మెడికల్ యూనివర్సటీ హాస్టళ్లను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారని, మహిళా విద్యార్థులను వేధించారని, పలువురు విద్యార్థులు గాయపడ్డారని పాకిస్తాన్‌కి చెందిన ఆజ్ న్యూస్ నివేదించింది. అయితే, బిష్కెక్ లోని పాక్ రాయబార కార్యాలయం ఇంకా మరణాల గురించి నివేదికలను పంచుకోలేదు, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని విద్యార్థుల్ని కోరింది. పాకిస్తానీ విద్యార్థులపై హత్య, అత్యాచారం జరిగిందని సోషల్ మీడియా పోస్టుల్లో ఆరోపించినప్పటికీ, అలాంటివి ధ్రువీకరింబడలేదని పాక్ రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ బిష్కెక్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, భారత రాయబార కార్యాలయంలో నిరంతరం టచ్‌లో ఉండాలని విద్యార్థులకు సూచించారు. పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారని కిర్గిజ్‌స్థాన్ ప్రభుత్వం తెలిపింది.

Read Also: TeamIndia: ఆ రోజునే న్యూయార్క్ బయలుదేరునున్న టీమిండియా ఆటగాళ్లు..

కిర్గిజ్‌స్థాన్ ఎందుకు వెళ్తున్నారు..?

మధ్య ఆసియా దేశాల్లో నాణ్యమైన వైద్య విద్యను అందించే దేశాల్లో కిర్గిజ్‌స్థాన్‌కి పేరుంది. అందుకే దక్షిణాసియా దేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఆ దేశానికి వెళ్తుంటారు. మైగ్రేషన్ డేటా పోర్టల్ ప్రకారం.. 5 మధ్య ఆసియా దేశాల్లో కిర్గిజ్‌స్థాన్ ఎక్కువ అంతర్జాతీయ విద్యార్థులు(61,418) కలిగి ఉంది. ఒక్క భారత్ నుంచే 14,500 మంది, పాకిస్తాన్ నుంచి 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా సౌకర్యాలు కలిగిన కిర్గిజ్‌స్థాన్ అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షిస్తోంది. చౌకైన జీవన వ్యయం, భారతీయ వంటకాలు లభించడం, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్ఫత్తి బాగుండటంతో పాటు కిర్గిజ్‌స్థాన్ వైద్య సంస్థలు అందించే డిగ్రీలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. అక్కడ రష్యన్ భాష మాట్లాడుతున్నప్పటికీ, ఇంగ్లీష్‌లో విద్యాబోధన చేయడంతో దక్షిణాసియా దేశాల నుంచి ఎక్కుమ మంది ఆ దేశాని వెళ్తున్నారు. ట్యూషన్ ఫీజు, క్లినికల్ శిక్షణతో సహా 5-6 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సుకి దాదాపుగా రూ.22 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది కూడా భారతీయ, ఇతర విదేశీ విద్యార్థులకు అనువుగా మారింది. అదే భారత్‌లో ఏదైనా కాలేజీలో ఇది రూ. 1కోటికి చేరుకుంటుంది. భారత్‌లో ఏటా 90,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి.

ఇటీవల పెరుగుతున్న ఒత్తిడి:

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల కిర్గిజ్‌స్తాన్ వలసల్ని ఎదుర్కొంటోంది. దీంతో ఇది స్థానికులపై ప్రభావం చూపుతోంది. గతంలో సోవియట్ రష్యాలో భాగంగా ఉన్న కిర్గిజ్‌స్థాన్ 1991లో స్వతంత్రమైంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత రెండేళ్లుగా పెట్టుబడులు తగ్గిపోయాయి. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల ఆంక్షలు కిర్గిజ్‌ని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వ డేటా ప్రకారంజనవరి నుండి సెప్టెంబర్ 2022 వరకు 184,000 మంది రష్యన్లు దేశానికి వచ్చారు.