Site icon NTV Telugu

కోవాగ్జిన్‌పై తేల్చేసేందుకు సిద్ధ‌మైన డ‌బ్ల్యూహెచ్‌వో..

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా భార‌త్ నుంచి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.. కోవాగ్జిన్, కోవీషీల్డ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగం పుంచుకుంది.. ఇక‌, ఇత‌ర దేశాల‌కు చెందిన వ్యాక్సిన్ల‌కు సైతం ఆమోదం తెలిపింది కేంద్రం.. దీంతో.. మ‌రికొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. అయ‌తే, భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్య‌వ‌స‌ర వినియోగానికి ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌.. కానీ, త్వ‌ర‌లోనే తేల్చేందుకు మాత్రం సిద్ధం అవుతోంది.. అందులో భాగంగా.. ఈ నెల 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) సాంకేతిక సలహా బృందం సమావేశం అవ్వ‌నుంది.

ఈ స‌మావేశంలో భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే విష‌యంపై చ‌ర్చించ‌నున్నారు.. ఈ విష‌యాన్ని డ‌బ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్ల‌డించారు.. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు భారత్ బయోటెక్‌తో కలిసి డబ్ల్యూహెచ్‌వో పని చేస్తోంద‌ని.. విస్తృతమైన టీకా పోర్ట్​ఫోలియో ఉండాలన్నది తమ లక్ష్యమని తెలిపారు సౌమ్య స్వామినాథన్‌. ఇక‌, క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారామె.. కాగా, కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర అనుమతుల కోసం డ‌బ్ల్యూహెచ్‌వోకు ఇప్ప‌టికే స‌మాచారం ఇచ్చింది భారత్‌ బయోటెక్.. గత నెల 27వ తేదీన‌ అదనపు సమాచారాన్ని కూడా పంపించింది.. ఈ స‌మావేశంలో.. ఆ డేటాను నిపుణులు స‌మీక్షించ‌నున్నారు.. దాని కోస‌మే ఈ నెల 26న స‌మావేశం కానున్నారు.. ఈ భేటీ త‌ర్వాత కొవాగ్జిన్‌ టీకాపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇవ్వ‌నుంది.

Exit mobile version