Saudi Arabia: సౌదీ అరేబియాలో బంగ్లాదేశీ యువకుడు నజ్రుల్ ఇస్లాం, మహిళ స్వీటీ అక్తర్‌కు మరణశిక్ష అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. మక్కాలోని పవిత్ర మసీదు ప్రాంగణంలో ‘‘అనైతిక చర్యల’’కు పాల్పడ్డారనే అభియోగాల మీద వీరిద్దరికి సౌదీ అధికారులు మరణశిక్ష అమలు చేశారు. అయితే, వారు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారనే విషయం ఇప్పటికీ సౌదీ అధికారులు స్పష్టం చేయడం లేదు. మరోవైపు, మరణశిక్ష విధింపుపై తమకు సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
అప్పు చేసి సౌదీ అరేబియాకు..
ఇదిలా ఉంటే, ఈ ఘటనలో మరణశిక్షకు గురై మరణించిన బంగ్లా యువతి స్వీటీ అక్తర్ కష్టాలు అందర్ని కంటతడి పెట్టిస్తున్నాయి. స్వీటీ చనిపోవడంతో ఆమె నాలుగేళ్ల కుమార్తె అనాథగా మారింది. తల్లిదండ్రుల్ని కష్టాల నుంచి బయటపడేయాలని అప్పు చేసి సౌదీ అరేబియాకు వెళ్తే, చివరకు శవంగా తిరిగి వచ్చింది. తన కుమార్తె మరణంపై సౌదీ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం లేదని కుటుంబం చెబుతోంది. స్వీటీ నాలుగేళ్ల క్రితం సౌదీకి వెళ్లింది. ఆమెను విదేశాలకు పంపేందుకు తండ్రి ఫజల్ మియాన్ సుమారు 1.5 లక్షల బంగ్లాదేశీ టాకాలను అప్పుగా తీసుకున్నారు. టాంగైల్కు చెందిన ఫజల్ రోజూవారీ కూలీగా పనిచేస్తున్నారు. స్వీటీ తనకు మొదటి 5 నెలలు డబ్బు పంపిందని, ఆ తర్వాత ఇద్దరు మహిళా కార్మికులతో గొడవ జరిగినందుకు పోలీసులు అరెస్ట్ చేశారని, ఆమె కుటుంబానికి చెప్పినట్లు తండ్రి వెల్లడించారు.
ఏడాదిగా కుటుంబంతో సంబంధాలు కట్..
స్వీటీ జైలుకు వెళ్లిన తర్వాత దాదాపుగా ఏడాది పాటు కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయని ఫజల్ మియాన్ తెలిపారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేయడం ప్రారంభించిందని, నెలకు ఒకసారి మాట్లాడేదని చెప్పారు. చివరిసారిగా రెండు నెలల్లో జైలు నుంచి విడులయ్యే అవకాశం ఉందని స్వీటీ చెప్పినట్లు తండ్రి వెల్లడించారు. 15 రోజుల క్రితం కూడా స్వీటీ తమతో మాట్లాడిందని, మరణశిక్ష గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు.
బంగ్లా ప్రభుత్వం ఏం చెప్పడం లేదు..
స్వీటీ మరణశిక్ష అమలు చేసినట్లు మూడు రోజుల క్రితమే తమకు తెలిసిందని, బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ధ్రువీకరణ రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కుమార్తెకు ఏం జరిగిందో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలని కోరారు.
వివాహ బంధం విచ్ఛిన్నం.. అనాథగా కూతురు..
స్వీటీ వివాహ బంధం విచ్ఛిన్నమైన తర్వాత కుటుంబాన్ని ఆదుకునేందుకు సౌదీ అరేబియా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. స్వీటీ విదేశాలకు వెళ్లిన తర్వాత ఆమె అక్క బ్యూటీ వద్ద చిన్నారి ఉంటోంది. కుమార్తె భవిష్యత్తు, తల్లిదండ్రులను కష్టాల నుంచి గట్టెక్కియాలని సౌదీకి వెళ్లిన స్వీటీ ఇప్పుడు మరణశిక్షకు గురైంది.
స్వీటీ, నజ్రుల్ బంధంపై అస్పష్టత..
ఈ కేసులో స్వీటీ, నజ్రుల్ మధ్య సంబంధంపై క్లారిటీ లేదు. మక్కాలో ఒక మసీదులో అనైతిక చర్యలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో వీరిద్దరికి మరణశిక్ష అమలు చేశారు. అయితే, నజ్రుల్తండ్రి అబ్దుల్ బషీర్ మాత్రం తన కుమారుడికి వివాహం కాలేదని, స్వీటీ ఎవరో తమకు తెలియదని చెబుతున్నారు. ఇద్దరు ఒకే చోట పనిచేసేవారని మాత్రమే తెలుసని చెప్పారు.

