Bangladesh Violence: బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంగా మారింది. అక్కడి రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు అరాచకాలకు పాల్పడ్డారు. మైమెన్‌సింగ్ నగరంలో గురువారం రాత్రి మత దూషణ ఆరోపణల నేపథ్యంలో ఒక మూక దాడిలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. 25 ఏళ్ల దాస్, మైమన్‌సింగ్ నగరంలో నివసిస్తున్నాడు. అక్కడ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తూ, జీవనోపాధి పొందుతున్నాడు. నగరంలోని స్క్వర్ మాస్టర్‌బారి ప్రాంతంలోని పయనీర్ నిటి కాంపోజిట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.
అయితే, స్థానిక సాక్షుల కథనం ప్రకారం, దైవదూషణ ఆరోపణలు ఫ్యాక్టరీ ప్రాంగంణంలో, చుట్టపక్కల ప్రాంతాల్లో వేగంగా వ్యాపించడంతో ఉద్రిక్తత పెరిగింది. ఆ తర్వాత ఒక గుంపు దాస్‌పై తీవ్రంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. భలుకా మోడల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (దర్యాప్తు) అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ.. హత్య తర్వాత, గుంపు మృతదేహాన్ని ఢాకా-మైమెన్‌సింగ్ హైవే పక్కన పడేసి నిప్పంటించిందని, దీంతో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయిందని తెలిపారు.
Read Also: Pawan Kalyan: విభజన తర్వాత పదేళ్లు నలిగిపోయాం.. తెలుగు జాతి కోసం కూటమిగా ఏకమయ్యాం..
ఈ ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఘటనను ఖండిస్తున్నట్లు యూనస్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. న్యూ బంగ్లాదేశ్‌లో హింసకు తావులేదని, నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని చెప్పింది. ఈ దాడికి పాల్పడిన వారిలో ఏడుగురిని బంగ్లా అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను మహ్మద్ లిమోన్ సర్కార్ (19), మహ్మద్ తారెక్ హుస్సేన్ (19), మహ్మద్ మణిక్ మియా (20), ఎర్షాద్ అలీ, నిజుమ్ ఉద్దీన్, అలోమ్‌గిర్ హుస్సేన్ (38) ,మహ్మద్ మీరాజ్ హుస్సేన్ అకోన్ (46)గా గుర్తించారు.
అయితే, వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ శనివారం ఈ ఘటనపై మాట్లాడారు. దీపు చంద్ర దాస్‌పై మత దూషణ ఆరోపణలు తప్పుగా మోపారని అన్నారు. ఒక ముస్లిం సహోద్యోగి ఒక చిన్న విషయంపై దీపును శిక్షించాలని, తప్పుడు ఆరోపణలు చేయడంతో అతడిని మూకదాడిలో చంపేశారని అన్నారు.
