Who Is Alice Huang: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంతో ప్రపంచాన్ని ఏలుతున్న టెక్ దిగ్గజం ‘ఎన్విడియా’ అధినేత జెన్సన్ హువాంగ్ను తన మాయలో పడేసి, సిలికాన్ వ్యాలీ నుంచి వాషింగ్టన్ దాకా ప్రకంపనలు సృష్టిస్తున్న పేరు ‘ఆలిస్ హువాంగ్’. ఒక సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన టెక్ సీఈఓ పక్కన కనిపించే స్థాయికి ఎదిగిన ఈమె ఎవరు? ఈమె చుట్టూ అంతర్జాతీయ గూఢచర్య వల ఎందుకు అల్లుకుంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్.
మిస్టరీగా మారిన గతం.. అన్నీ అనుమానాలే
హువాంగ్ లే అనే అసలు పేరున్న ఆలిస్ హువాంగ్ చైనా పౌరురాలు. పేరులో హువాంగ్ ఉన్నప్పటికీ ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు ఎలాంటి రక్త సంబంధం లేదు. ఈమె బయోడేటాను పరిశీలిస్తే ఎవరికైనా కళ్లు చెదరాల్సిందే. తొలినాళ్లలో చైనా ప్రభుత్వ అధికారిక మీడియా ఛానెళ్లయిన హునాన్ టీవీ, సీసీటీవీలలో రిపోర్టర్‌గా పనిచేసినట్లు, ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత బ్యాంక్ హెచ్ఎస్బీసీ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించినట్లు, అనంతరం సీఐటీఐసీ సెక్యూరిటీస్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అమెరికన్ దర్యాప్తు సంస్థలు, అంతర్జాతీయ మీడియా ఆరా తీయగా.. హునాన్ టీవీ వర్గాలు ఆమెను గుర్తుపట్టడానికే నిరాకరించాయి. అటు సీసీటీవీ అధికారిక రికార్డుల్లోనూ ఆమె పనిచేసిన దాఖలాలు లేవని తేలింది. దీంతో ఆమె చూపించిన ఈ భారీ ప్రొఫైల్ మొత్తం అంతర్జాతీయంగా పెద్ద పెద్ద వ్యక్తులను ఆకర్షించేందుకు వేసిన ఒక నకిలీ ముసుగా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
సింగపూర్ కంపెనీ.. టెక్ బాస్‌కు ఎర
ఆ తర్వాత ఆమె షాంఘైకి చెందిన హెక్సీ ఇన్వెస్ట్మెంట్లో ఫండ్ మేనేజర్‌గా, సింగపూర్ కేంద్రంగా పనిచేసే ‘మెగాస్పీడ్’ అనే సంస్థలో ఉన్నత పదవిలోకి వచ్చారు. ఈ మెగాస్పీడ్ సంస్థకు చైనా గేమింగ్ దిగ్గజం ‘7రోడ్’తో లోతైన సంబంధాలున్నట్లు సమాచారం. ఈ కంపెనీ ముసుగులోనే ఆమె జెన్సన్ హువాంగ్‌కు దగ్గరయ్యారని చెబుతున్నారు. జూన్ 2024లో తైవాన్ రాజధాని తైపీలోని ఓ లగ్జరీ బార్లో జెన్సన్, ఆలిస్ కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత మే 2025లో తైపీలోని ఓ రెస్టారెంట్ బయట జెన్సన్ వెనుకే ఆలిస్ నిలబడి ఉండటం కలకలం రేపింది. కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యమే కాకుండా, ఎన్విడియా బోర్డు మీటింగ్స్, పాలసీల సమాచారాన్ని రాబట్టేందుకు, చిప్ సేల్స్ విధానాన్ని చైనాకు అనుకూలంగా మార్చేందుకే డ్రాగన్ కంట్రీ ఆమెను రంగంలోకి దించిందనేది అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో తాను భార్యకు ద్రోహం చేసినట్లు జెన్సన్ హువాంగ్ స్వయంగా అంగీకరించాల్సి వచ్చింది.
రూ. 40 వేల కోట్ల డీల్.. తెరవెనుక సూత్రధారి
అమెరికా ఆంక్షల కారణంగా చైనాకు అత్యంత శక్తిమంతమైన ఏఐ చిప్‌ల సరఫరా ఆగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో ఆలిస్ కీలక బాధ్యతలు చూస్తున్న మెగాస్పీడ్ కంపెనీ.. గత రెండేళ్లలో ఏకంగా 4.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 40,000 కోట్లకు పైగా) విలువైన ఎన్విడియా చిప్‌లను కొనుగోలు చేసింది. సింగపూర్ సంస్థ పేరుతో కొని వాటిని చైనాకు మళ్లించారా? అందుకోసమే ఆలిస్ జెన్సన్ హువాంగ్ను తన వలలో వేసుకున్నారా? అన్న కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. చైనా ప్రభుత్వం, సింగపూర్ అధికారులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ.. ఒక టెక్ దిగ్గజాన్ని ఏమార్చి, చిప్ టెక్నాలజీ గుట్టు లాగేందుకు వేసిన ఈ ‘హనీట్రాప్’ వెనుక ఉన్న ఆలిస్ హువాంగ్ నిజంగానే కార్పొరేట్ ఉద్యోగా లేక చైనా నిఘా విభాగం పంపిన వ్యూహాత్మక ఏజెంటా అన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

