White House Lockdown: ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఉండగానే కలకలం.. తాత్కాలిక లాక్‌డౌన్‌

White House Lockdown

White House Lockdown

White House Lockdown: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద కలకలం రేగింది.. వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌కు ఎదురుగా ఉన్న లఫాయెట్‌ స్క్వేర్‌ ప్రాంతంలో ఓ కారు సైన్‌పోస్ట్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్‌హౌస్‌ పరిసరాల్లో తాత్కాలిక లాక్‌డౌన్‌ విధించారు. ప్రమాదం జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. సిల్వర్‌ కలర్‌లో ఉన్న ఓ సెడాన్‌ కారు లఫాయెట్‌ స్క్వేర్‌ ఉత్తర భాగంలోని రాతి పరిచిన ప్రదేశంలోకి దూసుకెళ్లి అక్కడున్న సైన్‌పోస్ట్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారులో నుంచి పొగలు వెలువడ్డాయి. ఈ సమయంలో డ్రైవర్‌ వాహనం నుంచి బయటకు వచ్చాడు. అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బందితో అతడు వాగ్వాదానికి దిగి, అనంతరం భౌతిక ఘర్షణకు పాల్పడ్డాడు.

సీక్రెట్ సర్వీస్, నేషనల్ గార్డ్ సిబ్బందితో డ్రైవర్ ఘర్షణ
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ది వాషింగ్టన్ సన్‌’కు చెందిన జర్నలిస్ట్‌ మార్టిన్‌ ఆస్టర్‌ముహెల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వీడియోలో ప్రమాదానికి గురైన కారు నుంచి పొగలు వస్తుండగా డ్రైవర్‌ బయటకు వచ్చి భద్రతా సిబ్బందితో ఘర్షణ పడుతున్న దృశ్యాలు కనిపించాయి. డ్రైవర్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు, నేషనల్‌ గార్డ్‌ సిబ్బందితో పోరాటానికి దిగినట్లు ఆయన వెల్లడించారు. అయితే కారు సైన్‌పోస్ట్‌ను ఢీకొట్టడానికి ముందు అసలు ఏం జరిగిందనే విషయం స్పష్టంగా తెలియలేదని పేర్కొన్నారు.

డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణ అనంతరం డ్రైవర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వైట్‌హౌస్‌ వద్ద కొద్దిసేపు తాత్కాలిక లాక్‌డౌన్‌ విధించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అదే సమయంలో వైట్‌హౌస్‌లో ఉండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. వైట్‌హౌస్‌కు ఎదురుగా ఉండే లఫాయెట్‌ స్క్వేర్‌ ఒక బహిరంగ పార్కు కావడంతో అక్కడ జరిగిన ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే డ్రైవర్‌ వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? అనే విషయాలపై అప్పటికి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

2023లోనూ వైట్‌హౌస్‌ సమీపంలోకి దూసుకెళ్లిన యూ-హాల్‌ ట్రక్కు
వైట్‌హౌస్‌ సమీపంలో వాహనం భద్రతా అవరోధాలను ఢీకొట్టడం ఇదే తొలిసారి కాదు. 2023 మే నెలలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అప్పట్లో 19 ఏళ్ల యువకుడు యూ-హాల్‌ ట్రక్కును నడుపుతూ లఫాయెట్‌ స్క్వేర్‌ ఉత్తర భాగంలో ఉన్న వైట్‌హౌస్‌ భద్రతా అవరోధాలను ఢీకొట్టాడు. ఈ ఘటన అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అధ్యక్షుడిని బెదిరించడం, ఫెడరల్‌ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సహా పలు అభియోగాలు అతడిపై నమోదయ్యాయి. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానించారు. తాజాగా మరోసారి వైట్‌హౌస్‌ ఎదురుగా కారు ప్రమాదానికి గురికావడం, డ్రైవర్‌ భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగడం అమెరికా భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.