S Jaishankar: పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పాలసీని భారత్ అనేక దశాబ్ధాలుగా కొనసాగిస్తోందని, అనేక దేశాలు దీన్ని ఆమోదించాయని, ప్రస్తుతం ఇది అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ సమక్షంలో మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సదస్సులో ఇంటరాక్టివ్ సెషన్‌లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Urvashi Rautela: ఈ డైరెక్టర్.. హాట్ బ్యూటీని వదిలేలా లేడుగా..?
అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ చేసిన దాడుల్ని ‘ఉగ్రవాదం’గా ఆయన అభివర్ణించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ మానవతా సాయాన్ని పాటించాల్సిన అంతర్జాతీయ బాధ్యతను గుర్తుచేశారు. ప్రజల ప్రాణనష్టం పట్ల ఇజ్రాయిల్ జాగ్రత వహించాలని జైశంకర్ సూచించారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత వైఖరిని నాలుగు పాయింట్లలో జైశంకర్ వివరించారు. ఒకటి అక్టోబర్ 7న జరిగిన దాడి ఉగ్రవాదమే అని, రెండోది ఇజ్రాయిల్ ప్రతిస్పందనలో ప్రాణనష్టం గురించి జాగ్రత్త వహించాలని, మూడోది బందీలను విడుదల చేయడం తప్పనిసరి అని, నాలుగవది ఉపశమనం అందించడానికి మానవతా కారిడార్ అవసరమని, దీర్ఘకాలిక పరిష్కారం ఉండాలని సూచించారు. భారతదేశం పాలస్తీనా-ఇజ్రాయిల్ రెండు దేశాల పరిష్కారాన్ని చాలా కాలంగా విశ్వసిస్తోందని చెప్పారు.
అక్టోబర్ 7న జరిగిన ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదులు తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడుల్లో 1200 మంది ఇజ్రాయిలీలను చంపేయడంతో పాటు 220 మందిని బందీలుగా కిడ్నాప్ చేసి గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ లోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 25,000 పైగా మంది మరణించారు. హమాస్ చేసిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
