అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ పరాజయం పాలయ్యారు. ట్రంప్‌పై భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. తొలుత సర్వేలన్నీ కమలా హారిస్ వైపే ఉన్నాయి. మళ్లీ డెమోక్రటిక్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కోడైకూశాయి. కానీ ఫలితాలు వచ్చేటప్పటికీ అంచనాలన్నీ తారుమారయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ భారీ విక్టరీని నమోదు చేశారు. ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటి విజయం సాధించారు. దాదాపు 280 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ సాధించారు.
బుధవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం నుంచి కూడా ట్రంపే భారీ విజయం దిశగా దూసుకెళ్లారు. స్వింగ్ రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ.. రెండవసారి వైట్ హౌస్‌కి ట్రంప్ అడుగుపెట్టారు. అయితే ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వెలువడడంతో కమలా హారిస్ అభిమానులు నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లిపోయారు. ఓటమిని జీర్ణించుకోలేక.. కంటతడి పెట్టారు. ఇంకొందరైతే ఎక్కి.. ఎక్కి ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమలా హారిస్ ఎన్నికల వాచ్ పార్టీలో అతిథులు ఏడుస్తూ కూర్చున్నారు. అన్ని ఖాళీ స్టాండ్‌లే కనిపించాయి. కమలా హారిస్ ఓటమి తర్వాత మద్దతుదారులు వేదిక నుంచి బయటికి వెళ్లిపోయారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 270 మ్యాజిక్ ఫిగర్ ఉండగా.. ప్రస్తుతం ఇప్పటి వరకూ ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇక విస్కాన్సిన్‌లో ట్రంప్ గెలుపొందారు. తాజా ఫలితాలను చూస్తుంటే అమెరికన్లు ఏకపక్షంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ను గెలిపించాలన్న ఉద్దేశంతోనే అమెరికన్లు ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ట్రంప్ భారీ విజయం దిశగా దూసుకెళ్లారు. ఇక రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంపై ప్రపంచ నాయకులంతా శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఓట్లు సాధించాలి. కానీ ఆ సంఖ్య దాటేసింది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేశారు. 2021 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడంతో జో బైడెన్ అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష పదవి పోయిన తర్వాత ట్రంప్ ఎన్నో ఆరోపణలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేసి మరీ గెలిచారు.