Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..

  • చరిత్ర సృష్టించిన వయోజర్-1
  • నేటితో ఒక కాంతి రోజు దూరానికి..
  • అత్యంత దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు..
  • సూర్య మండలం దాటి ప్రయాణం..
Voyager 1

Voyager 1

Voyager 1: దాదాపు 49 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన వయోజర్-1 అంతరిక్ష నౌక విశ్వంలో మరో మైలురాయిని చేరుకుంది. నేటితో భూమి నుంచి ఒక ‘‘కాంతి రోజు’’ ప్రయాణించిన చరిత్ర సృష్టించింది. నవంబర్ 18న మధ్యాహ్నం 3:46 గంటలకు వాయేజర్-1 ఒక లైట్ డే దూరాన్ని చేరుకుంది. మానవుడి చేత నిర్మితమైన విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్‌గా నిలిచింది. దాదాపు 5 దశాబ్దాల క్రితం పంపించిన ఈ అంతరిక్ష నౌక ఇప్పటికీ భూమికి అంతరిక్ష రహస్యాలను చేరవేస్తోంది.

సూర్యమండలం దాటిన వయోజర్-1

కాంతి ఒక రోజులో(24 గంటల్లో) ఎంత దూరం ప్రయాణిస్తుందో దానిని ‘‘లైట్ డే’’గా పరిగణిస్తారు. ఇది సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్లు. కాంతి సెకన్‌కు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు సుమారు 61 వేల కిలోమీటర్లు ప్రయాణించే వయోజర్-1 ఈ దూరాన్ని చేరుకోవడానికి 50 ఏళ్ల పట్టింది. దీనిని బట్టి చూస్తే విశ్వం ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఇంత దూరం ప్రయాణించినా వయోజర్ కేవలం సూర్య మండలంలోని వెలుపల ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లో ప్రయాణిస్తోంది.

1977లో ప్రయోగం..

వాయేజర్-1ను 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించారు. దీనిని ప్రయోగించిన తర్వాత 16 రోజులకు వయోజర్-2 ప్రయోగించారు. సౌర కుటుంబంలో గురుడు, శని, యూరేసన్, నెప్ట్యూన్ వంటి బయటి గ్రహాలను పరిశీలించేందుకు వీటిని ప్రయోగించారు. ఈ రెండు అంతరిక్ష నౌకలు గ్రహాల గురుత్వాకర్షణ శక్తినిఆసరాగా చేసుకుని ముందుకు సాగాయి. ఈ పద్ధతినే గ్రావిటేషనల్ అసిస్ట్ అంటారు. 1979లో వాయేజర్-1 బృహస్పతి (జూపిటర్) గ్రహాన్ని, 1980లో శని (సాటర్న్) గ్రహాన్ని సమీపంగా పరిశీలించింది. ఈ గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, వలయాలకు సంబంధించిన అద్భుతమైన సమాచారాన్ని భూమికి పంపించింది. 2012లో వయోజర్-1 హీలియోపాజ్‌ను దాటింది. సూర్యుడి నుంచి వెలువడే కణాలు, అయస్కాంత క్షేత్రాలతో ఏర్పడిన రక్షణ కవచంలో వెలుపలి సరిహద్దునే హీలియోపాజ్ అంటారు. ఆ తర్వాత దీనిని దాటేసి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది.

1970ల టెక్నాలజీతో ఇప్పుడు కూడా పని..

వయోజర్-1 1970 నాటి టెక్నాలజీతో ఇప్పటికీ పనిచేస్తోంది. దీనికి ఉండే థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ల సోలార్ ప్యానెల్స్ లేకుండా అంతరిక్ష నౌకకు విద్యుత్ ను అందిస్తున్నాయి. ఇదే సమయంలో విశ్వంలోని అత్యంత శీతల ఉష్ణోగ్రతల నుంచి నౌకను కాపాడేందుకు వేడిని విడుదల చేస్తున్నాయి. ప్లూటోనియం-238 అనే రేడియోధార్మిక పదార్థం క్షీణించడం వల్ల విడుదలయ్యే వేడిని ఈ జనరేటర్లు విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ప్రతీ ఏడాది ఇలా విడుదలయ్యే విద్యుత్ తగ్గుతూ వస్తోంది. రేడియోధార్మిక పదార్థం క్షీణిస్తున్న కొద్దీ ప్రతి ఏడాది ఉత్పత్తి అయ్యే విద్యుత్ పరిమాణం తగ్గిపోతోంది.

ఈ పరిస్థితుల్లో నౌకకు సంబంధించిన కీలక పరికరాలు పనిచేసేలా, మిగతా పరికరాలను ఆపేశారు. అప్పటి సాంకేతికతతో ఇప్పటికీ విశ్వంలోని సుదూర ప్రాంతాల నుంచి సందేశాలను పంపిస్తోంది. 2030 వరకు వయోజర్ మిషన్లు కొనసాగేలా నాసా చర్యలు తీసుకుంటోంది.

ఎక్కడికి వెళ్తోంది..?

వయోజర్-1 సూర్యమండలాన్ని దాటి విశ్వంలో ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది గ్లీసే 445 అనే నక్షత్రం దిశగా ప్రయాణిస్తోంది. సుమారు 40 వేల ఏళ్ల తర్వాత ఆ నక్షత్రానికి దాదాపుగా 1.7 లైట్ ఇయర్స్ దూరం నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఈ అంతరిక్ష నౌకలో గోల్డెన్ రికార్డ్ ఉంది. ఇందులో భూమిపై జీవజాలానికి సంబంధించిన శబ్దాలు, సంగీతం, వివిధ భాషల్లో పలకరింపులు, చిత్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏదైనా గ్రహాంతర నాగరికత ఈ వ్యోమనౌకను కనుగొంటే.. భూమి గురించి తెలుసుకునే సందేశంగా వీటిని రూపొందించారు.