Site icon NTV Telugu

Trump-Machado: ట్రంప్‌తో మచాడో భేటీ.. నోబెల్ శాంతి బహుమతి అందజేత

Trump Machado

Trump Machado

వెనిజులా సంక్షోభం తర్వాత వైట్‌హౌస్‌లో కీలక సమావేశం జరిగింది. అధ్యక్షుడు ట్రంప్‌ను వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో కలిశారు. ఈ సందర్భంగా నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేశారు. దాదాపు వైట్‌హౌస్‌లో మచాడో రెండున్నర గంటలు గడిపారు. వెనిజులా సంక్షోభం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

అంతకముందు మచాడో మద్దతుదారులు వైట్‌హౌస్ వెలుపల ఘనస్వాగతం పలికారు. మచాడోకు మద్దతుగా నినాదాలు చేశారు. సమావేశం అనంతరం మచాడో మాట్లాడుతూ.. ‘‘అధ్యక్షుడు ట్రంప్‌పై మనం నమ్మకం ఉంచవచ్చు.’’ అని పేర్కొంది. ఇక నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ తీసుకున్నారా? అని విలేకర్లు అడిగినప్పుడు సమాధానం చెప్పేందుకు మచాడో నిరాకరించారు. నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసే సంస్థ అవార్డును బదిలీ చేయడం గానీ.. ఇతరులతో పంచుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మచాడో ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

ఇక మచాడోకు ట్రంప్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ పేరు ఉన్న బహుమతి సంచిని వైట్‌హౌస్ నుంచి తీసుకెళ్లారు. మచాడో తన పర్సుతో పాటు సంచిని కూడా తీసుకెళ్లినట్లు కనిపించింది. ఎరుపురంగు సంచిపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం ఉంది. అయితే సంచిలో ఏముందో మాత్రం తెలియలేదు.

ఇక వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. మచాడో చాలా మంది వెనిజులా ప్రజలకు అద్భుతమైన, ధైర్యవంతమైన స్వరం అని పేర్కొ్న్నారు. ఆమె నాయకత్వ అవకాశాలపై ట్రంప్ అంచనాలు మారలేదని తెలిపారు. ఆమెకు నాయకత్వం వహించడానికి దేశీయ మద్దతు లేదని గతంలో ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మచాడోపై అమెరికా చట్టసభ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: BMC Result: నేడు ముంబై మున్సిపల్ ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే!

జనవరి 3న అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని మచాడో సమర్థించారు. అమెరికాను కొనియాడారు. ఇక ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న మచాడో.. గురువారం అమెరికాలో ప్రత్యక్షమయ్యారు. ఇంత కాలం ఎక్కడున్నారో తెలియదు. మీడియాతో కూడా ఎలాంటి విషయాలు పంచుకోలేదు.

 

 

Exit mobile version