అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ మరోసారి తన మత విశ్వాసాలపై స్పందించారు. తాను హిందూ కుటుంబంలో పెరిగానని.. అందువల్ల క్రైస్తవ మతంలోకి మారాల్సిన అవసరం ఎప్పుడూ అనిపించలేదని స్పష్టం చేశారు. జేడీ వాన్స్ కేథలిక్ మతంలోకి మారినప్పటికీ.. తనపై ఎప్పుడూ మత మార్పిడి ఒత్తిడి తీసుకురాలేదని చెప్పారు.
ఇటీవల ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో ఉషా వాన్స్ మాట్లాడుతూ.. ‘‘జేడీ నన్ను క్రైస్తవ మతంలోకి మార్చాలని కోరుకుంటున్నారని చాలామంది భావిస్తున్నారు. కానీ అది అపార్థం. ఆయన కేథలిక్ కావడంతో తన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనే భావన ఉంటుంది. అంతే తప్ప ప్రతిరోజూ నన్ను మతం మార్చుకోమని ఒత్తిడి చేయరు’’ అని వివరించారు. జేడీ వాన్స్ తన బాల్యంలో అనేక కుటుంబ సమస్యలు, అస్థిర పరిస్థితులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఆయన జీవితంలో స్థిరత్వం కోసం చాలా కాలం వెతికారని.. ఆ స్థిరత్వాన్ని ఆయన మత విశ్వాసంలో కనుగొన్నారని చెప్పారు. అయితే తన పెంపకం పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. ‘‘నేను భారతీయ వలసదారుల కుటుంబంలో, హిందూ సంప్రదాయాల మధ్య చాలా స్థిరమైన, సంతోషకరమైన వాతావరణంలో పెరిగాను. అందుకే జేడీలా కొత్తగా ఏదో వెతకాల్సిన అవసరం నాకు అనిపించలేదు’’ అని తెలిపారు.
జేడీ వాన్స్ మత విశ్వాసాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఒకసారి నేను ఆయనతో ‘నీకు థెరపీ పనిచేయలేదు.. కానీ చర్చి పనిచేసింది’ అని చెప్పాను’’ అని ఉషా వెల్లడించారు. అయితే థెరపీ అందరికీ పనికిరాదని తాను చెప్పడం లేదని.. కానీ జేడీకి ఆ ప్రక్రియపై నమ్మకం ఏర్పడలేదని, చర్చిలో మాత్రం ఆయనకు మానసిక ప్రశాంతత లభించిందని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో తమ కుటుంబ జీవితంపై కూడా ఉషా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన జేడీ, ఉషా దంపతులు త్వరలో నాలుగో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. మరొక బిడ్డను కనాలని గత కొంతకాలంగా జేడీ ఆలోచిస్తున్నారని ఉషా వెల్లడించారు. ‘‘భవిష్యత్తులో పశ్చాత్తాపం లేకుండా ఉండాలంటే మరో బిడ్డ ఉండాలని ఆయన భావించారు’’ అని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఫాదర్స్ డే సందర్భంగా ఉషా నిర్వహించే ‘స్టోరీటైమ్ విత్ ది సెకండ్ లేడీ’ పోడ్‌కాస్ట్‌లో జేడీ వాన్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉషా ‘‘హనీ.. ఈ రోజు వచ్చినందుకు ధన్యవాదాలు’’ అని చెప్పగా.. జేడీ ‘‘నిన్ను చూడటం ఆనందంగా ఉంది’’ అంటూ ఆమె మోకాలిపై చేయి వేసిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ‘‘ఇది చాలా అసౌకర్యంగా కనిపించింది’’ అని కొందరు వ్యాఖ్యానించగా.. మరికొందరు ‘‘ఆయన ఆమెను పెంపుడు జంతువును తడిమినట్టుగా తట్టారు’’ అంటూ ట్రోల్ చేశారు.
Usha Vance: I didn’t need to convert to Catholicism and try to be someone I’m not like JD because I grew up in a happy, stable household.
I love this woman. JD can rewrite every aspect of his own identity in order to gain power. But he can’t change Usha. pic.twitter.com/GRsjBRdKKv
— Richard Hanania (@RichardHanania) June 23, 2026
The face Usha Vance makes when JD touches her knee is a cry for help if I've ever seen one pic.twitter.com/UQX2khC9CW
— Mike Nellis (@MikeNellis) June 23, 2026

