China spy balloon: అమెరికా, చైనా మధ్య హై ఆల్టిట్యూడ్ బెలూన్ ఒకటి ఉద్రిక్తతలను పెంచుతోంది. చైనా నిఘా బెలూన్ గా అనుమానిస్తున్న అమెరికా దాన్ని కూల్చేందుకు సిద్ధం అయింది. కమర్షియల్ విమానాలు ఎగిరే ఎత్తు కన్నా పైన ఈ బెలూన్ ఉన్నట్లు పెంటగాన్ గుర్తించింది. ఈ బెలూన్ ను ట్రాక్ చేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. నిఘా కోసమే దీన్ని చైనా ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీన్ని కూల్చేందుకు అమెరికా తన ఎఫ్-22 ఫైటర్ జెట్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా, దీన్ని కూల్చడం వల్ల శకలాలు నేలపై పడి ప్రజలకు ప్రమాదం వాలిల్లే అవకాశం ఉందని అధికారులు అధ్యక్షుడు జో బైడెన్ కు సూచించారు.
Read Also: Apple: యాపిల్ చూపు.. భారత్ వైపు.. ఎందుకంటే?
ప్రస్తుతం ఈ బెలూన్ ఉత్తర అమెరికా మీదుగా కెనడా, అలస్కా వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఇది అణు క్షిపణి కేంద్రాలపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్నట్లు యూఎస్ అనుమానిస్తోంది. బుధవారం ఈ బెలూన్ అమెరికాలోని మోంటానా రాష్ట్రంపై ఉన్నట్లు గుర్తించారు. అమెరికాలో మూడు భూగర్భ అణుక్షిపణి కేంద్రాలు ఉంటే అందులో ఒకటి మాల్మ్ స్ట్రోమ్ వైమానిక స్థావరం వద్ద ఉంది. దీనిపై నుంచి బెలూన్ ఎగిరినట్లు అనుమానిస్తున్నారు. అయితే దీని వల్ల పెద్దగా ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ కాకపోవచ్చని అమెరికన్ అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ బెలూన్ వ్యవహారం రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడారు. వాస్తవాలను ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చైనా శుక్రవారం వెల్లడించింది. అమెరికా అగ్రశ్రేణి దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ బీజింగ్‌లో పర్యటించడానికి ముందు ఈ బెలూన్ వ్యవహారం వచ్చింది. వాస్తవాలు స్పష్టంగా కనిపించే వరకు, ఉహాగానాలు చేయడం, హైప్ పెంచడం వంటివి సమస్య పరిష్కారానికి సహాయపడవు అని మావో నింగ్ అన్నారు. చైనా బాధ్యతాయుతమైన దేశం, అంతర్జాతీయ చట్టాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది, ఏ సార్వభౌమాధికార దేశం యొక్క భూభాగాన్ని లేదా గగనతలాన్ని ఉల్లంఘించే ఉద్దేశం మాకు లేదని ఆయన అన్నారు.
