NTV Telugu Site icon

USA: అమెరికాలో దారుణం… కాల్పుల్లో 10 మంది మృతి

Ny Shooting 1280x720

Ny Shooting 1280x720

అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కాల్పులు జరిపి ఏకంగా 10 మందిని హతమార్చాడు ఓ దుండగుడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు సైనిక తరహా దుస్తులు ధరించి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( ఎఫ్ బీ ఐ) కాల్పులకు పాల్పడిన వ్యక్తికి ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అని విచారిస్తున్నారు. కాల్పులు జరిపే క్రమంలో నిందితుడి తలపై హెల్మెట్ తో పాటు కెమెరా కూడా ఉందని తెలుస్తోంది. అయితే కాల్పుల ఘటనను నిందితుడు ప్రత్యక్ష ప్రసారం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాల్పులకు గల కారణాల గురించి పోలీసులు విచారణ జరుపుతోంది. నిందితుడు ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడనే కోణంలో విచారణ సాగుతోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని 18 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. నల్లజాతీయులు ఎక్కువగా ఉండే ఓ సూపర్ మార్కెట్ లో ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జాతి విద్వేషం కారణంగానే కాల్పులు జరిగి ఉంటాయని అననుమానిస్తున్నారు. కాల్పుల్లో గాయపడి, చనిపోయిన వారిలో 13 మందిలో 11 మంది నల్ల జాతీయులే ఉన్నారు. కాల్పులు జరిగిన ప్రదేశం యూఎస్- కెనడా సరిహద్దుల్లోని న్యూయార్క్ నగరంలో ఉంది.

ఇదిలా ఉంటే అమెరికాలో నెల వ్యవధిలో ఇది రెండో కాల్పుల ఘటన. ఎప్రిల్ 12న, న్యూయార్క్ లోని బరో ఆఫ్ బ్రూక్లిన్ సబ్ వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. ఈ దాడికి కారణం అయిన 62 ఏళ్ల ఫ్రాంక్ఆర్. జెమ్స్ ను మాన్ హటన్ లో అదుపులోకి తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా యూఎస్ లో గన్ కల్చర్ పెరిగిపోతోంది. వరసగా ఎక్కడో చోట కాల్పలు ఘటనలు జరుగుతున్నాయి. గన్ వైలెన్స్ ఆర్కైవ్ వెబ్ సైట్ ప్రకారం, తుపాకీ కాల్పుల వల్ల ప్రతీ ఏడాది అమెరికాలో 40, 000 మంది ప్రాణాలు వదులుతున్నారు.