Site icon NTV Telugu

America: అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 50 ఏళ్ల నాటి అబార్షన్‌ హక్కు రద్దు

Us Supreme Court Strikes Down Abortion Rights

Us Supreme Court Strikes Down Abortion Rights

అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దాదాపు 50 ఏళ్ల కిందట అబార్షన్‌ను దేశవ్యాప్తంగా చట్టబద్ధం చేస్తూ వెలువడిన తీర్పును అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలకు అబార్షన్ హక్కును అనుమతిస్తూ వెలువడిన చరిత్రాత్మక తీర్పును తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన ఒక అధికార పత్రం లీక్ అయిన కొన్ని వారాల తరువాత ఈ నిర్ణయం వెలుగు చూసింది.

గర్భవిచ్ఛిత్తిని నిషేధించే విషయంలో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. 5-3 మెజార్టీతో సంబంధిత తీర్పు వెలువడింది. అమెరికా దేశవ్యాప్తంగా దాదాపు 25 రాష్ట్రాలు అబార్షన్‌పై త్వరలోనే నిషేధాజ్ఞలు విధించే అవకాశాలున్నాయి. సుప్రీం తీర్పును అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తప్పుపట్టారు. అబార్షన్‌ విషయంలో మహిళల హక్కులను కాపాడేందుకు తన అధికారాలను ఉపయోగించుకుంటూ అవసరమైన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా విమర్శలు గుప్పించారు. అమెరికన్ల స్వేచ్ఛపై దాడిగా దాన్ని పేర్కొన్నారు. మరో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం దీనిపై హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు అబార్షన్లపై ఆంక్షలను పలు దేశాలు సడలిస్తున్న తరుణంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఆ దేశ సంప్రదాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఉదారవాదులు కోర్టు తీర్పును విభేదించారు. పేద మహిళలు, ముఖ్యంగా నల్లజాతి మహిళలపై ఇది బాగా ప్రభావం చూపుతుందని అన్నారు. కాగా, ఈ తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు వాషింగ్టన్‌లోని కోర్టు పరిసరాల్లో బారీగా బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

అబార్షన్‌కు సంబంధించి అమెరికాలో ఇటీవల ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహించగా.. మెజార్టీ పౌరులు మహిళలకు ఆ విషయంలో పూర్తి హక్కులు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని పలు రాష్టాల్లో భారీగా నిరసన చేపట్టారు. 50 రాష్ట్రాల్లో నిరసనకు దిగిన అమెరికన్లు.. అబార్షన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఇటీవల టెక్సాస్‌లో అబార్షన్‌పై ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టం అమల్లోకి రాగా.. కొత్త చట్టాలతో రాజ్యాంగపరమైన హక్కులకు భంగం వాటిల్లుతోందని అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version