1984 One Of “Darkest Years” In Indian History says US Senator:ఆధునిక భారతదేశంలో 1984 సంవత్సరాన్ని చీకటి సంవత్సరంగా అభివర్ణించారు అమెరికా సెనెటర్ పాట్ టూమీ. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు భారతదేశ చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోయిందని అన్నారు. సిక్కులపై జరిగిన అల్లర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 31, 1984న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు సిక్కు అంగరక్షకులు చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. సిక్కులే టార్గెట్ గా ఢిల్లీలో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. భారతదేశం అంతటా 3 వేల మంది సిక్కులు చంపబడ్డారు.
భారతదేశంలో జాతుల మధ్య హింసాత్మక సంఘటనను ప్రపంచం చూసిందని.. ఈ హింసలో సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు పెన్సిల్వేనియా సెనెటర్ పాట్ టూమీ. 1984,నవంబర్ 1న జరిగిన అల్లర్లను ఆయన ప్రస్తావించారు. దాదాపుగా 30,000 మందికి పైగా సిక్కు మహిళలను, పురుషులను, పిల్లలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆయన అన్నారు.
READ ALSO: Bhatti Vikramarka: గాంధీజీ అడుగు జాడల్లోనే భారత్ జోడో యాత్ర
భవిష్యత్తులో మానవహక్కుల ఉల్లంఘనలను నివారించడానికి, ఇతర సమాజాలపై అఘాయిత్యాలు జరగకుండా చూడాలని టూమీ అన్నారు. అమెరికన్ సిక్కు కాంగ్రస్ కాకస్ సభ్యుడిగా టూమీ ఉన్నారు. సిక్కుమతం దాదాపుగా 600 ఏళ్ల చరిత్ర కలిగి భారతదేశంలోని పంజాబ్ అంతటా విస్తరించిందని.. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3 కోట్ల మంది సిక్కులు ఉన్నారని.. అమెరికాలో 7 లక్షల మంది నివసిస్తున్నారని ఆయన అన్నారు. అమెరికాలో కోవిడ్ మహమ్మారి సమయంలో పెన్సిల్వేనియాతో పాటు, యునైటెడ్ స్టేట్స్ లోని సిక్కు సంఘాలు జాతి, మతం అని తేడా లేకుండా పదివేల కుటుంబాలకు కిరణా సరకులు, మాస్కులు, ఇతర సామాాగ్రి అందించారని టూమీ అన్నారు. సిక్కుల స్ఫూర్తిని తాను వ్యక్తిగతంగా చూశానని సమానత్వం, గౌరవం, శాంతిపై స్థాపించబడిన సిక్కు సంప్రదాయాన్ని బాగా అర్థం చేసుకున్నామని టూమీ అన్నారు.