నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా ప్రాణాంతక దాడులు చేసిందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. నైజీరియాలో క్రైస్తవుల హత్యకు ప్రతీకారంగా శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడులు నిర్వహించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో అనేక మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించారని తెలిపారు.
ఆ మధ్య కాలంలో క్రైస్తవులే లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఊచకోత కోశారు. దీంతో అమెరికా పలుమార్లు ఐసిస్ ఉగ్రవాదులను హెచ్చరించింది. కానీ ఐసిస్ ఏ మాత్రం లెక్కచేయలేదు. దీంతో నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు క్రిస్మస్ రోజున అమెరికా ప్రాణాంతక, అత్యంత శక్తివంతమైన దాడులు చేసింది. ఈ ఘటనలో అనేక మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ తెలిపింది. ఎంత మంది చనిపోయారనేది మాత్రం సంఖ్య వెల్లడించలేదు.
నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు అనేక మంది ISIS ఉగ్రవాదులను చంపామని యూఎస్ ఆఫ్రికా కమాండ్ ఒక పోస్ట్‌లో తెలిపింది. ఇక నైజీరియా ప్రభుత్వ మద్దతు, సహకారానికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ అన్నారు.
