NTV Telugu Site icon

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. పారిస్ వేదికగా చర్చలు..

Gaza War

Gaza War

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మరోసారి సంధికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పారిస్ వేదికగా ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయి్ల ఉన్నతాధికారులు భేటీ అయినట్లు సమచారం. ఈ యుద్ధం వల్ల ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు వెస్ట్రన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయిల్‌ని కోరుతున్నాయి. మరోవైపు హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలుమార్లు వెల్లడించారు.

Read Also: Akkineni Nagarjuna: నన్నెవ్వరు నమ్మలేదు.. చివరికి అమల కూడా.. పిచ్చి పట్టిందా అన్నట్లు.. ?

ఇరు వర్గాల మధ్య సంధి కోసం ఫ్రెంచ్ అధికారులు ఖతార్, పాలస్తీనా, ఈజిప్ట్, ఇజ్రాయిల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ ఇజ్రాయిల, ఈజిప్ట్ అధికారులతో పాటు రాబోయే రోజుల్లో ఖతార్ ప్రధానిని కలుస్తారని పలువర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణకు బదులుగా హమాస్ ఆధీనంలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేసేందుక చర్చలు జరపడానికి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సీఐఏ చీఫ్‌ని పంపుతున్న గత వారం ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 100 మందికి పైగా బందీలను విడుదల చేస్తే ప్రతిఫలంగా గాజాలో ఇజ్రాయిల్ తన యుద్ధాన్ని రెండు నెలల పాలు నిలిపివేసే ఒప్పందాన్ని అమెరికా నేతృత్వంలోని మధ్యవర్తులు సంధి చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ శనివారం వెల్లడించింది. ఇప్పటికే సంధిక సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని ఆదివారం పారిస్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బందీలను విడిపించేందుకు బైడెన్ ఖతార్ ఎమిర్‌తో మాట్లాడారు.

గతేడాది నవంబర్ నెలలో ఇలాగే సంధి జరిగింది. దీనికి ఖతార్, ఈజిప్ట్ అధికారులు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే అందుకు ప్రతిఫలంగా హమాస్ తమ చెరలోని ఇజ్రాయిల్ బందీలలో కొందర్ని విడిచిపెట్టింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది హతమార్చింది. 250 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం వీరిలో 132 మంది గాజాలో ఉన్నట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. ఇందులో 28 మంది బందీలు చనిపోయారు. మరోవైపు ఇజ్రాయిల్ దాడుల్లో 26,000కి పైగా పాలస్తీనా ప్రజలు మరణించారు.