Site icon NTV Telugu

US-India: భారత్‌పై దాడి చేసిన పాకిస్థాన్ ఉగ్ర గ్రూపులపై అమెరికా సంస్థ సంచలన రిపోర్ట్

Pakistan

Pakistan

భారత్‌ను లక్ష్యం చేసుకున్న ఉగ్రవాద గ్రూపులపై అమెరికా సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన రిపోర్ట్ బయట పెట్టింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ ఇప్పటికీ ఆశ్రయం కల్పిస్తోందని నివేదికలో హెచ్చరించింది. 2008 ముంబై దాడులకు బాధ్యత వహించిన లష్కర్-ఎ-తైబా, 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడితో సంబంధం ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలు ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగం నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది.

భారత్, కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకున్న గ్రూపులతో సహా పలు రకాల ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ తన గడ్డపై ఆశ్రయం కల్పిస్తూనే ఉందని వెల్లడించింది. సంవత్సరాల తరబడి సైనిక చర్యలు, విధానపరమైన చర్యలు చేపట్టినప్పటికీ ఉగ్రవాద గ్రూపులు పాకిస్థాన్ గడ్డపై తమ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నాయని నివేదికలో స్పష్టం చేసింది.

ఇక నివేదిక ప్రకారం.. 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రవాదం పుంజుకోవడంతో పాటు పాకిస్థాన్ తీవ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశంగా నిలిచిందని తెలిపింది. అంతేకాకుండా చాలా వరకు ఉగ్రవాద గ్రూపులు ఇస్లామిస్ట్ తీవ్రవాద భావజాలంతో ప్రేరేపించబడ్డాయని యూఎస్ కాంగ్రెస్ పరిశోధన విభాగం తేల్చింది. ఈ బృందాలు ఐదు వర్గాలుగా విభజించబడ్డాయని… ప్రపంచ దృష్టి, ఆఫ్ఘనిస్థాన్ దృష్టి, భారతదేశం, కాశ్మీర్ దృష్టి, దేశీయ దృష్టి, మతతత్వ సంస్థలు అని పేర్కొంది.

అల్‌ఖైదా ప్రధాన భాగం తీవ్రంగా బలహీనపడినప్పటికీ పాకిస్థాన్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తూ.. ఇతర తీవ్రవాద సంస్థలతో పొత్తులు కొనసాగిస్తోందని తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్‌లో అంచనా ప్రకారం ‘‘4,000-6,000 మంది యోధులు’’ ఉన్నారని.. ఇది ఇతర తీవ్రవాద గ్రూపుల మాజీ సభ్యులను చేర్చుకుని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ అంతటా కార్యకలాపాలు నిర్వహిస్తోందని నివేదికలో పేర్కొంది.

దేశీయంగా తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్‌ను (పాకిస్థాన్‌లో పనిచేస్తున్న అత్యంత ప్రాణాంతకమైన ఉగ్రవాద సంస్థ)గా అభివర్ణించింది. దీనిలో సుమారు 2,500 నుంచి 5,000 మంది యోధులు ఉన్నారని.. పాకిస్థాన్ రాజ్యాన్ని కూలదోసి షరియా చట్టాన్ని విధించడమే దీని లక్ష్యమని తెలిపింది.

కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్..
కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) అనేది అమెరికా కాంగ్రెస్‌కు (పార్లమెంట్) చట్టపరమైన, విధానపరమైన విశ్లేషణలను అందించే ఒక స్వతంత్ర సంస్థ. నిష్పక్షపాత పరిశోధనా సంస్థ. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భాగమైన ఈ సంస్థ.. సభ్యులకు గోప్యమైన.. అధికారిక సమాచారాన్ని 24/7 అందిస్తుంది. ఇది ప్రధానంగా అమెరికా జాతీయ విధానాలు, విదేశీ వ్యవహారాలు, చట్టాలపై పరిశోధనలు చేస్తుంది. నిష్పక్షపాతతంగా.. రాజకీయాలకు అతీతంగా.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా.. కేవలం వాస్తవాలను, విశ్లేషణను మాత్రమే అందిస్తుంది.

Exit mobile version