Site icon NTV Telugu

Ukraine Russia War: మరోసారి ఆస్పత్రికి జెలెన్‌స్కీ.. బాధితులకు పరామర్శ

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధానికి రోజులు, వారాలు గడుస్తున్నాయి. వరుసగా 23వ రోజు ఉక్రెయిన్‌లో రష్యా ఎడతెగని విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు మారణహోమం సృష్టిస్తోంది. జనావాసాలపైనా రాకెట్‌ బాంబులు ప్రయోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. గతంలో ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా కనిపించిన ఉక్రెయిన్‌ నగరాలు.. ఇప్పుడు కకావికలంగా మారాయి. ఎక్కడ చూసిన కూలిన భవనాలు, పొగచూరుకుపోయిన గోడలు, ధ్వంసమైన వాహనాలు వంటివే కనిపిస్తున్నాయి. గతానికి, ఇప్పటికి ఉక్రెయిన్‌లో ఏర్పడిన పరిస్థితులను కళ్లకు కట్టేలా ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒక వీడియో విడుదల చేశారు.

Read Also: Pegasus: ఏపీలో పెగాసెస్ స్పై వేర్ కలకలం.. దీదీ వ్యాఖ్యలతో..!

ఇక, యుద్ధం ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా రష్యా లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకపోగా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్‌ సైనికులు ఉన్నచోట్ల బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ సైనికులు కూడా రష్యా బలగాలను వెంటాడుతున్నారు. తమ దేశంలోకి దురాక్రమణకు వచ్చినవారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యా వైమానిక దళం గగనతలంలోనూ బీభత్సం సృష్టిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధ విమానాలను వెంటాడి మిసైల్‌ దాడులతో మట్టుబెడుతున్నాయి. రష్యాకు SU-52 యుద్ధ విమానాల సామర్థ్యం ముందు ఉక్రెయిన్‌ యుద్ధ విమానాలు తలవంచక తప్పడం లేదు. ఉక్రెయిన్‌ నగరాల్లోని వాణిజ్య సముదాయాలు, నివాస భవనాలపైనా రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖార్కివ్‌లోని బరవషోవో మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రాకెట్‌ బాంబులు ప్రయోగించింది. దీంతో మార్కెట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు, రష్యా దాడుల్లో గాయపడిన ఉక్రెయిన్‌ పౌరులను ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి పరామర్శించారు. రాజధాని కీవ్‌ నగరంలోని ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.

Exit mobile version