Site icon NTV Telugu

Ukraine Russia War: రష్యా దాడుల్లో హీరోయిన్‌ మృతి..

ఉక్రెయిన్‌ – రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ మరోసారి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పట్టుకోసం ప్రయత్నిస్తున్న రష్యా బలగాలు.. తీవ్రదాడులకు పాల్పడుతున్నాయి.. అదే స్థాయిలో ఉక్రెయిన్‌ సేనల నుంచి ప్రతిఘటన కూడా తప్పడంలేదు.. ఇక, ఇప్పటికే నలుగురు రష్యా మేజర్ జనరల్స్ తమ చేతితో హతమయ్యారని, 14 వేల మంది సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్‌ చెబుతోంది.. ఇదే సమయంలో.. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌ సైనికులతో పాటు సాధారణ ప్రజలు, ప్రముఖులు కూడా ప్రాణాలు కోల్పోతోన్నారు.. తాజాగా, రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్‌ మృతిచెందారు.

Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్..

ఎలాగైనా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ని ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్న రష్యన్‌ బలగాలు… ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. నివాస స్థలాలపై కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.. ఈ దాడుల్లో 67 ఏళ్ల ఒక్సానా ప్రాణాలు విడిచినట్టు ఆమె నేతృత్వంలో పనిచేస్తున్న ‘యంగ్‌ థియేటర్‌’ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.. 1955లో జన్మించిన ఒక్సానా ష్వెట్స్‌.. ఇవాన్ ఫ్రాంకో థియేటర్, కీవ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్‌లో అభ్యసించారు. ఇక, సుదీర్ఘకాలం పాటు థియేటర్‌ ఆర్టిస్టుగా కొనసాగారు.. ఉక్రెయిన్‌లతో పాటు.. ఇతర దేశాలకు సుపరిచుతురాలు.. ఈ నేపథ్యంలోనే ఆమెను ఉక్రెయిన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెరిటెడ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా వరించింది.. ఓవైపు థియేటర్‌ ఆర్టిస్టుగా.. మరోవైపు సినిమాల్లోనూ నటించారు.. అనేక సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకును ఆకట్టుకున్నారు.. ఇలా.. రష్యా దాడుల్లో ఆమె ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. ఇక, ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు, గ్రామీణ ప్రాంతాలు, కీవ్‌ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి.

Exit mobile version