ఉక్రెయిన్, రష్యా మధ్య దాదాపు నాలుగు నెలల నుంచి యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంతో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్ని రష్యా ఆక్రమించుకోగా, రష్యా సైనికుల్ని తిప్పికొట్టి కొన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్. అయితే, ఈ యుద్ధానికి తెరపడేదెప్పుడు? ప్రస్తుత పరిణామాల్ని బట్టి చూస్తుంటే, ఈ యుద్ధం సుదీర్ఘకాలం పాటు సాగేలా ఉంది. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
ఇప్పుడు తాజాగా నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ సైతం.. ఇంకా కొన్నేళ్లపాటు జరగనున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు పశ్చిమ దేశాలన్నీ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో భారీ మూల్యం చెల్లించాల్సి కూడా ఉంటుందని చెప్పారు. అదే సమయంలో మాస్కో తన సైనిక లక్ష్యాల్ని సాధించుకుంటే, అంతకుమించిన మూల్యం చెల్లిస్తామని జెన్స్ పేర్కొన్నారు. సైనికసాయం కారణంగా యుద్ధం ఖరీదు కాదని, పెరుగుతున్న ఇంధర ఆహార ధరల కారణంగా యుద్ధంలో చెల్లించాల్సిన మూల్యం పెరిగిపోతోందన్నారు. ఉక్రెయిన్‌ను అత్యాధునిక ఆయుధాలు ఇస్తే, తూర్పు డాన్‌బాస్‌లోని ఆక్రమిత ప్రాంతాల్ని విముక్తి చేయించడానికి వీలవుతుందన్నారు.
కాగా.. రష్యా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఇటీవల కాలంలో ఉక్రెయిన్ అధికారులు భారీ ఆయుధాల కోసం పశ్చిమ దేశాల్ని అభ్యర్థించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలోనే బుధవారం దేశ రక్షణ మంత్రి ఒలెక్సి రెస్నికోవ్ మాట్లాడుతూ.. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రతినిధుల్ని బ్రస్సెల్స్‌లో కలిసి ఆయుధాలివ్వాలని కోరారు. మరోవైపు.. మేరియుపొల్‌ను కాపాడేందుకు పోరాడిన ఇద్దరు ఉక్రెయిన్ టాప్ కమాండర్లను అదుపులోకి తీసుకొని, రష్యాకు పంపించారు.
