Site icon NTV Telugu

Ukraine Russia War: చర్చలు విఫలమైతే.. మూడో ప్రపంచ యుద్ధమే..!

ఉక్రెయిన్‌లోని ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులపైనే కాదు ప్రజల ఇళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లపైనా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా మరిమాపొల్‌లోని ఓ ఆర్ట్‌ స్కూల్‌పై బాంబులతో దాడి చేశాయి. దాదాపు 400 మంది తలదాచుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటివన్నీ యుద్ధ నేరాలేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. యుద్ధంలో తొలిసారిగా మొన్న ఓ ఆయుధాగారంపై కింజాల్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణిని ప్రయోగించిన రష్యా.. నిన్న సైతం లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్‌, క్రూయిజ్‌ క్షిపణులకు పని చెప్పింది. మైకొలైవ్‌ షిప్ యార్డ్ కు చేరువగా ఉన్న ఆయిల్ డిపోపై కింజాల్‌ క్షిపణితో దాడి చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కాస్పియన్‌ సముద్రంలో మోహరించి ఉన్న యుద్ధనౌకల ద్వారా క్రూయిజ్‌ క్షిపణుల్ని కూడా ఈ లక్ష్యంపై ప్రయోగించి, పేల్చివేసామంది. విదేశీ బలగాలు, ఉక్రెయిన్‌ ప్రత్యేక దళాలు వోవ్‌రుచ్‌లో ఏర్పరచుకున్న మిలటరీ బేస్ పైనా విమానాల ద్వారా క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలిపింది.

Read Also: Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అసలు కారణం ఏంటి..?

మరిమాపొల్‌పై మూడు వారాలుగా నిప్పులవాన కురుస్తూనే ఉంది. ఈ నగరానికి తాగునీరు, ఆహారం, ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. భారీ దాడుల కారణంగా భారీస్థాయి స్టీల్- స్టీల్ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతింది. మిగిలిన నగరాల్లో రష్యా సైనికులు అంతగా ప్రవేశించలేకపోయినా మరిమాపొల్‌లో మాత్రం క్రమేపీ మున్ముందుకు వెళ్తున్నారు. దీంతో పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్నాయి. మరోవైపు రష్యా సైన్యం దాడులను తమ సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతుందని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటి వరకు 14,700మంది రష్యా సైనికులు హతమైనట్లు ప్రకటించింది. దీనితోపాటు 476 ట్యాంకులు, 1487 మిలటరీ వాహనాలను ధ్వంసం చేసామంది. 96 విమానాలు, 118 హెలికాప్టర్లు, 21 యూఏవిలను నేలకూల్చినట్లు ప్రకటించింది. మొత్తం మూడు నౌకలు, 44 విమాన, మిస్సైల్ విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు ఉక్రెయిన్ చెప్పింది. ఇక, పుతిన్‌తో చర్చలు జరిపేందుకు రెండేళ్లుగా సిద్ధంగా ఉన్నామని అన్నారు ఉక్రెయిన్‌ అద్యక్షుడు జెలెన్‌స్కీ. చర్చలు జరగనిదే యుద్ధాన్ని ముగించలేమని చెప్పారు. ప్రతిరోజూ అమాయక ప్రజలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు వీలుగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. పుతిన్‌తో భేటీకి ఏ అవకాశం ఉన్నా వినియోగించుకుంటామని, చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధమేనని హెచ్చరించారు.

Exit mobile version