ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో వందల మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. యుద్ధం మొదలై రెండు వారాలు దాటిపోయింది. ఉక్రెయిన్ లో అపార ప్రాణ, అస్తి నష్టం జరుగుతోంది. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్, హాస్పిటల్స్ ఇలా మౌలిక వసతులన్ని దెబ్బతిన్నాయి. సిటీలన్నీ శిథిలాలతో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లోనూ రష్యా సైన్యం దాడులు చేస్తుండటంతో ప్రాన నష్టం భారీగానే జరుగుతోంది. చనిపోయిన సాధారణ పౌరుల సంఖ్య వెయ్యి దాటిందని అంచనా వేస్తున్నారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరో ప్రకటన చేశారు. రష్యాతో సంప్రదింపులకు తాము సిద్ధమేనన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. యుద్ధంలో ఇప్పటికే 1300మంది బలగాలను కోల్పోయామని చెప్పారు. ఇక, జెరూసలెంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవాలని ప్రతిపాదించారు జెలెన్‌స్కీ.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి మధ్యవర్తిగా వ్యవహరించమని కోరినట్లు చెప్పారు.
Read Also: Andhra Pradesh: రాబోయేది జనసేన ప్రభుత్వమే..!
యుద్దంలో ఇప్పటివరకు 79 మంది చిన్నారులు చనిపోయినట్టు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఫిబ్రవరి 24 నుంచి 100 మందికి పైగా పిల్లలు గాయపడినట్టు తెలిపింది. చిన్నపిల్లలు చనిపోవడం పట్ల ఉక్రెయిన్ ప్రథమ మహిళ వొలెనా జెలెన్‌స్కా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము పౌరులపై దాడి చేయడంలేదంటున్న రష్యాపై మండిపడ్డారు. చనిపోయిన పిలలల పేర్లను తాము బయటపెడతామన్నారు జెలెన్‌స్కీ.. అనుకున్నంత ఈజీగా ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యా భీకర దాడులు చేస్తోంది. నివాస ప్రాంతాలు, స్కూళ్లు, హాస్పిటల్స్‌ను కూడా వదలడంలేదు. రష్యా దాడుల్లో 202 స్కూళ్లు, 34 హాస్పిటల్స్, 15వందల నివాస సముదాయాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు రాజధాని కీవ్ సిటీ ముట్టడికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది రష్యా.
