NTV Telugu Site icon

Ukraine Crisis: రష్యా టార్గెట్ నేను, నా కుటుంబం.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన

ఉక్రెయిన్‌పై రష్యా భీకరస్థాయిలో యుద్ధం చేస్తోంది. దీంతో ప్రజలు భయంతో అల్లాడుతున్నారు. అయితే రష్యా మొదటి లక్ష్యం తానేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము ఉక్రెయిన్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి చర్చలకు రావాలని కోరారు. దాడులు ఆపేంతవరకు పోరాడుతూనే ఉంటామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ‘మనతో కలిసి యుద్ధం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? నాకు ఎవరూ కనిపించట్లేదు. నాటో సభ్యత్వంపై ఉక్రెయిన్ కు ఎవరు హామీ ఇవ్వగలరు? అందరూ భయపడుతున్నారు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

కాగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా సైన్యం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‍లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. కీవ్‌ నగరంపై ప్రధానంగా గురి పెట్టిన రష్యా… అనుకున్నట్లే నలువైపుల నుంచి దాడి చేసి నగరంలోకి చేరుకుంది. రష్యా దాడులతో కీవ్‍లో ఎయిర్‌ రెయిడ్‌ సైరన్లు నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్‌ ద్వీపాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.