Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలనంగా మారారు. అనేక నిర్ణయాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన ఉక్రెయిన్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావచ్చు’’ అని అన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీని కలవడానికి కొన్ని రోజులు ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలగాలు క్రమంగా పట్టు సాధిస్తున్నాయి. ఉక్రెయిన్ సిబ్బంది, ఆయుధాలు లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తాను అధ్యక్షుడైతే 24 గంటల్లోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని ప్రచారంలో భాగంగా పలు సందర్భాల్లో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడినట్లు చెప్పారు.
Read Also: Laila: ‘లైలా’ వల్గర్ కాదు నాటీ.. క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ కావాలి: డైరెక్టర్ రామ్ నారాయణ్
ఫాక్స్ న్యూస్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ సంక్షోభం గురించి ట్రంప్ మాట్లాడారు. ‘‘వారు (ఉక్రెయిన్) ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చు, కుదుర్చుకోక పోవచ్చు, వారు ఒక రోజు రష్యన్లు కావచ్చు , కాకపోవచ్చు’’ అని అన్నారు. ఉక్రెయిన్‌తో 500 మిలియన్ డాలర్ల డీల్‌తో పాటు అరుదైన ఖనిజాల వినయోగం అంశాన్ని ఆయన ప్రస్తావించారు. జెలన్ స్కీ ప్రభుత్వం భద్రతా హామీలకు బదులుగా యూఎస్ దాని ఇతర మిత్రదేశాలతో వనరుల వెలికితీత కోసం భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. అయితే, ఈ ఒప్పందంపై ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు.
ఉక్రెయిన్ పోరాటాన్ని ఆపేందుకు తన రాయబారి కీత్ కెల్లాగ్‌ని త్వరలోనే కీవ్ పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిల ఉంటే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చే వారం మ్యూనిచ్‌లో జెలన్ స్కీతో భేటీ కాబోతున్నారు. గత మూడేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే, రష్యాతో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవాలంటే, అమెరికా నుంచి కఠినమైన భద్రతా హామీలు లేదా నాటో సభ్యత్వం లేదా శాంతి పరిరక్షక దళాలను మోహరించాలని జెలన్ స్కీ డిమాండ్ చేస్తున్నారు. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు.