Site icon NTV Telugu

Ukraine Effect: విమాన సర్వీసులు నిలిపేసిన సంస్థ

ఉక్రెయిన్‌ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఓ విమానయాన సంస్థ తన సర్వీసుల్ని నిలిపేసింది. జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు తమ సర్వీసులు ఆపేశామని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని కీవ్‌తో పోర్టు సిటీ ఒడిసా కూడా నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తమ సిబ్బంది, ప్రయాణికుల రక్షణకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని సంస్థ తెలిపింది.

ఈ రెండు ప్రాంతాలకు తప్ప మిగిలిన నగరాలకు మాత్రం ఈ నెలాఖరు వరకు తమ విమాన సేవలు కొనసాగుతాయని లుఫ్తాన్సా తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డచ్ ఎయిర్‌లైన్స్ కేఎల్ఎం కూడా గత వారమే కీవ్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది. దీంతో రెండు సంస్థలు ఉక్రెయిన్ సంక్షోభంతో ముందు జాగ్రత్త పడ్డాయి.

ఇదిలా వుండగా.. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్‌ దళాల మధ్య ఘర్షణలు పెరిగాయి. అయితే ఆదివారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనూహ్యంగా ఆ ప్రాంతంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునివ్వడం గమనార్హం. తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని జెలెన్స్కీ ట్విట్టర్‌లో తెలిపారు.

https://ntvtelugu.com/russia-ukraine-conflict-tensions-in-border/
Exit mobile version