Site icon NTV Telugu

Ukraine Crisis: కాల్పులతో దద్దరిల్లిన తూర్పు ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో యావత్‌ ప్రపంచం అక్కడి పరిస్థితిలపై ఉత్కంఠతో గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడం తథ్యమన్న వేళ కాల్పులతో తూర్పు ఉక్రెయిన్‌లోని కాడివ్కా ప్రాంతం దద్దరిల్లింది. రష్యా మద్దతిస్తున్న వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైనికుల మధ్య ఈ కాల్పులు జరిగాయి. దీంతో ఈ ఘటనపై అటు ఉక్రెయిన్ సైన్యం, ఇటు వేర్పాటు వాదులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే తొలుత కాల్పులకు తెగబడ్డారని ఉక్రెయిన్ సైన్యం ఆరోపిస్తుంటే.. సైన్యమే తమపై తొలుత కాల్పులకు దిగిందని, గత 24 గంటల్లో నాలుగుసార్లు సైన్యం తమపై కాల్పులు జరిపిందని వేర్పాటువాదులు పేర్కొన్నారు.

కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకున్నా, ఇద్దరు పౌరులు గాయపడినట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లో కాల్పుల ఘటనపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్ ఆక్రమణపై కన్నేసిన రష్యా అందుకు కారణాన్ని చూపించేందుకు మారణహోమాన్ని సృష్టించే యత్నం చేస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్‌ను ఆక్రమించబోతోందంటూ వచ్చిన ఆరోపణలను రష్యా కొట్టిపడేసింది. సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తున్నట్టు, ఇప్పటికే లక్షలాదిమంది సిబ్బందిని వెనక్కి పిలిపించినట్టు వెల్లడిచింది.

Exit mobile version