Site icon NTV Telugu

Russia Ukraine War: కీవ్ సిటీ మా ఆధీనంలోనే ఉంది..

ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. బాంబుల మోత.. సైరన్‌ హెచ్చరిక.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. రాత్రి, పగలు తేడా లేదు, నిద్రాహారాలు లేవు. గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌లో ఇదే పరిస్థితి. ఎక్కడ బాంబు పడుతుందో… ఏవైపు నుంచి మిసైల్స్‌ దూసుకొస్తాయో.. తెలియదు. రష్యా దాడులకు ధీటుగా ఎదుర్కొంటోంది ఉక్రెయిన్‌ సైనం. ప్రజలు సైతం… ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడి కక్కడ రష్యా సైనికులను అడ్డుకుంటున్నారు. రష్యా దాడికి నిరసనగా రోడ్లపై నిరసన తెలుపుతున్నారు.

Read Also: Kodali Nani: సీపీఐ నారాయణ ఓ వింత జంతువు..!

రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న… రష్యాకు ఉక్రెయిన్‌ ధీటుగా జవాబిస్తోంది. రష్యా బలగాలపై ఉక్రెయిన్‌ సైన్యం ఎదురుదాడికి దిగింది. రష్యన్‌ ఆర్మీకి చెందిన IL-76 ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూల్చివేశాయి ఉక్రెయిన్ దళాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వేటగాళ్లుగా పిలువబడే చెచెన్ ప్రత్యేక దళాలను కూడా పుతిన్‌…. యుద్ధ రంగంలోకి తీసుకువచ్చారని సమాచారం. ఉక్రెయిన్ అధికారులను పట్టుకుని చంపేయడం లేదా తమకు అప్పగించాలని చెచెన్‌ దళాలకు రష్యా ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే, ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లోకి ర‌ష్యా భ‌ద్రతా బ‌ల‌గాలు ప్రవేశించాయ‌న్న వార్తలపై ఉక్రెయిన్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.. కీవ్ పూర్తిగా త‌మ ఆధీనంలోనే ఉంద‌ని ఉక్రెయిన్ డిప్యూటీ హెడ్ అడ్మినిస్ట్రేష‌న్ మైకోలా పోవోరోజ్నిక్ ప్రక‌టించారు. కీవ్‌లో ప‌రిస్థితి చాలా ప్రశాంతంగానే ఉందన్న ఆయన.. రాజ‌ధాని మొత్తం ఉక్రెయిన్ ఆర్మీ ద‌ళాల ఆధీనంలోనే ఉంది. ప‌రిస్థితి పూర్తిగా మా అదుపులోనే ఉందన్నారు. ఇక, త‌మ‌పై దాడులు చేయ‌డానికి వ‌చ్చిన ర‌ష్యా ద‌ళాలను ఉక్రెయిన్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

Exit mobile version