Site icon NTV Telugu

BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం

Bt Group

Bt Group

BT Group: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు వేల సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో యూకే టెలికాం దిగ్గజ సంస్థ బీటీ గ్రూప్ చేరింది. ఏకంగా 55,000 మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు 2030 నాటికి వరకు జరుగుతాయని వెల్లడించింది.

Read Also: YS Viveka Case: గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారం.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ

దశాబ్ధం చివరి నాటికి 55 వేల ఉద్యోగాలను తగ్గిస్తామని గురువారం వెల్లడించింది. ఇప్పటికే యూకే మొబైల్ ఫోన్ దిగ్గజం వొడాఫోన్ మూడేళ్లలో 11,000 ఉద్యోగాలను లేదా పదోవంతు సిబ్బందిని తగ్గించే ప్రణాళికను ప్రకటించిన రెండు రోజుల తర్వాత బీటీ గ్రూప్ కూడా 42 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బీటీ గ్రూప్ లో 1,30,000 సిబ్బంది ఉన్నారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దీన్ని 75,000 నుంచి 90,000 మందికి తగ్గించాలని చూస్తోంది.

ఆర్థికమాంద్య పరిణామాలు టెక్ కంపెనీలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా రెండు పర్యాయాలుగా వేలల్లో ఉద్యోగులను తీసేసింది. ఈ ఏడాది గత నెలలో 10,000 మందిని, గతేడాది నవంబర్ లో 11,000 మందిని తొలగించింది. అమెజాన్ 18,000 మందిని, గూగుల్ 12,000, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ 50 శాతం మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రానున్న కాలంలో యూఎస్, యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడుతాయనే వార్తల నేపథ్యంలో ఐటీ కంపెనీల పరిస్థితి కష్టతరంగా మారుతోంది. రానున్న కాలంలో మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉంది.

Exit mobile version