NTV Telugu Site icon

Covid 19: సుదీర్ఘకాలం కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత కోలుకున్న వ్యక్తి

Covid 19

Covid 19

UK Researchers Cure Man Who Had Covid For 411 Days: రెండున్నరేళ్ల నుంచి ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడుతోంది. అనేక దేశాలు వ్యాక్సిన్లను తయారు చేసినా కూడా తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టానా.. ముప్పు మాత్రం ఇంకా తప్పిపోలేదు. కరోనా వల్ల చాలా కుటుంబాలు, పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. లక్షల్లో ప్రజలు మరణించారు.

ఇదిలా ఉంటే యూకేలో ఓ రోగి సుదీర్ఘకాలం పాటు కరోనాతో పోరాడాడు. ఏకంగా 411 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు. ఇంత కాలం పాటు కోవిడ్ కు చికిత్స తీసుకుంటున్న వ్యక్తికి వ్యాధి నయం అయింది. రోగికి సోకిన వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధిని నయం చేశామని శుక్రవారం బ్రిటీష్ పరిశోధకులు వెల్లడించారు. పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ లాంగ్ కోవిడ్, పదే పదే వచ్చే కోవిడ్ ఇన్ఫెక్షన్లకు భిన్నంగా ఉంటుందని.. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన రోగుల్లో ఈ రకం ఇన్ఫెక్షన్ సంభవిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్ సగం మంది రోగులకు ఊపిరితిత్తుల వాపు వంటి నిరంతర లక్షణాలను కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. అయితే చనిపోతాడనుకున్న వ్యక్తిని బతికించామని పరిశోధకులు చెబుతున్నారు.

Read Also: Total Lunar Eclipse 2022: ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం.. “బ్లడ్ మూన్”గా దర్శనం ఇవ్వనున్న చంద్రుడు

బ్రిటన్ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి 13 నెలల తర్వాత ఎలా కోవిడ్ ను అధిగమించాడో వివరించారు పరిశోధకులు. అప్పటికే కిడ్నీ మార్పిడి కారణంగా బలహీనమైన ఇమ్యూనిటీ కలిగిన వ్యక్తికి డిసెంబర్ 2020లో కరోనా సోకింది. అతనికి పదేపదే ఇన్ఫెక్షన్ సోకుతుందా..? లేక లాంగ్ ఇన్ఫెక్షన్ సోకిందా..? అని తెలుసుకోవడనాకి నానోపోర్ సీక్వెనింగ్ టెక్నాలజీతో జన్యు విశ్లేషణ చేశారు. ఈ క్రమంలో రోగికి బీ.1 వేరియంట్ సోకినట్లుగా గుర్తించి చికిత్స అందించారు. కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ద్వారా చికిత్స అందించారు.

ఇతర యాంటీబాడీల చికిత్స మాదిరిగా.. ఈ చికిత్సను విస్తృతంగా ఉపయోగించరని.. ఇది ఓమిక్రాన్ వంటి వేరియంట్ పై సమర్థంగా పనిచేయదని పరిశోధకులు తెలిపారు. అయితే సదరు వ్యక్తి కోవిడ్ ఫస్ట్ వేవ్ లోనే కరోనాకు గురవ్వడంతో ఈ చికిత్స ద్వారా నయం చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం యూకే, యూఎస్ లతో పాటు పలుదేశాల్లో ఉన్న కోవిడ్ వేరియంట్లపై ప్రస్తుతం ఈ చికిత్స సమర్థవంతంగా పనిచేయకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.