India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర వివాదాన్ని రాజేసింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా అట్టడుగు స్థానానికి వెళ్లాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ వివాదంపై స్పందించాయి. అమెరికా విచారణకు ఇండియా సహకరించాలని కోరింది.
తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఈ వివాదంపై స్పందించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో రిసి సునాక్ మాట్లాడారు. భారత్, కెనడా దౌత్యవివాదం తగ్గుముఖం పడుతుందని తాను భావిస్తున్నట్లు రిషి సునాక్ అన్నారు. ట్రూడో, సునాక్ భారత దౌత్యవివాదంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తరుణంలో, చట్టాన్ని గౌరవించాలని యూకే పునరుద్ఘాటించింది.
Read Also: World Cup: 2019-2003 వరల్డ్ కప్.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ వివరాలు ఇవే..!
దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ సూత్రాలతో సహా అన్ని దేశాలు సార్వభౌమాధికారం, చట్ట నియమాలను గౌరవించాలనే వైఖరిని యూకే ప్రధాని రిషి సునాక్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత తగ్గాలని ఆశిస్తున్నట్లు సునాక్ తెలిపారు.
జూన్ నెలలో కెనడాలోని సర్రేలోని గురుద్వారా ముందు నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తోందని, కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత్ ధ్వజమెత్తింది.